అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గత నెల 29న కోరం లేక, శాంతిభద్రతల సమస్యల కారణంగా వాయిదా పడిన 36 పాఠశాలల్లో శనివారం రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పలుచోట్ల రాజకీయ జోక్యం, వర్గ విభేదాలతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 17 చోట్ల మాత్రమే ఎస్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 19 పాఠశాలల్లో కోరం లేకపోవడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. జిల్లాలో మొత్తం 1,725 స్కూళ్లకు గాను గత నెల 29న 1,687 స్కూళ్లల్లో పూర్తయిన విషయం విదితమే.
పట్టుకోసం మళ్లీ ఒత్తిళ్లు
తమకు అనుకూలమైన వారినే ఎస్‌ఎంసీ చైర్మన్లుగా నియమించుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసుల అండతో ఒత్తిళ్లకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండోసారి నిర్వహించిన ఎన్నికల్లోనూ తమకు అనుకూలంగా ఉన్న వారిని చైర్మన్లుగా చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పలుచోట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఇందుకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం పన్నాగం బెడిసికొట్టింది.
ఎన్నికల నిర్వహణలో విఫలం
నార్పల : పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ మండలంలోని మూడు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా వేశారు. బండ్లపల్లిలో ఎస్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి సభ్యులను పాఠశాలలోకి రాకుండా టీడపీ నాయకులు భయపెడుతూ.. సమయాన్ని వృథా చేసి.. కోరం తక్కువగా ఉందని ఎన్నికను వాయిదా వేయించారు. ఇక దుగుమర్రి పాఠశాలలో గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నందున ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు. కర్ణపుడి గ్రామంలో అయితే టీడీపీ నుంచే ఇద్దరు వ్యక్తులు చైర్మన్ స్థానం కోసం పోటీపడటంతో .. ఘర్షణ చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు ఎన్నికలు వాయిదా వేయించారని స్థానికులు చర్చించుకున్నారు.
ఏకపక్షంగా ఎన్నికలు
బ్రహ్మసముద్రం: ఎస్.కోనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్‌ఎంసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఎన్నికలు నిర్వహించడానికి తగినంత కోరం లేదు. అయినా టీడీపీ నాయకులు తరగతి గది తలుపులు వేసి మరీ తమ మద్దతుదారులను చైర్మన్‌గా గెలిపించుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓటింగ్‌లో పాల్గొనకుండా బయటే నిలువరించారు. దీంతో కొద్దిసేపు పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సాయికుమార్ పాఠశాలకు చేరుకోగా.. ఇక్కడ ఎలాంటి సమస్యా లేదంటూ మభ్యపెట్టి పంపించేశారు. అనంతరం ఏకపక్షంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇది అప్రజాస్వామికమంటూ సూగేపల్లి, సంతే కొండాపురం, ఎస్.కోనాపురం గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కూటమి నాయకుల కిరికిరి
కుందుర్పి: కూటమి నాయకుల కిరికిరి కారణంగా మండలంలోని నిజవల్లి, మహంతపురం, ఎనుముల దొడ్డి, బెస్తరపల్లి, కొలిమిపాళ్యం గ్రామాల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఐదు పాఠశాలల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మెజార్టీ ఉంది. చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధికి ఇష్టం లేదు. దీంతో ఆయన డైరెక్షన్‌లో పోలీసులు, ఉపాధ్యాయులు నడుచుకున్నారు. పథకం ప్రకారం గొడవలు, తోపులాటలు జరిగేలా చేసి.. ఎన్నికలను మరోసారి వాయిదా పడేలా చేశారు.
● అలాగే గార్లదిన్నె మండలం కనంపల్లి, గుత్తి మండలం మామిళ్లచెరువు, కళ్యాణదుర్గం మండలం మల్లాపురం, కంబదూరు మండలం అచ్చంపల్లి, శింగనమల మండలం పెరవళి పాఠశాలల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి.
19 చోట్ల ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా
రెండోసారి కూడా రాజకీయ జోక్యంతో రచ్చ
36 పాఠశాలల్లో ఎన్నికలు.. 17 చోట్లే పూర్తయిన ప్రక్రియ


