చిన్నారి చికిత్స కోసం సాయం చేయదలిస్తే ..
● అకౌంట్ నంబర్ 30830783425
● ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్ 001125కు డబ్బు పంపవచ్చు
తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. హైదరాబాద్‌కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్‌బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్‌ఎమ్‌ఏ టైప్–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్‌కుమార్‌రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు.
రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు
చచ్చుబడిన కాళ్లు, చేతులు
ఆలస్యం చేస్తే శరీరమంతటికీ సోకుతుందని డాక్టర్ల హెచ్చరికలు
రూ. 17 కోట్ల ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని సూచన
ఆపన్నహస్తం కోసం బాధిత తల్లిదండ్రుల ఎదురుచూపు


