ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

అనంతపురం అర్బన్‌: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు ఆరుతడిపంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు వచ్చినప్పటికీ ఎల్‌నినో ప్రభావం కారణంగా రాబోయే నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ శాఖలు కరువు ప్రణాళికలు, ఉపశమన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల వరకు పీఎండీఎస్‌ (ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌) అమలు చేయాలని చెప్పారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిసాగు స్థానంలో ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చీనీ సాగునూ తగ్గించి ఇతర పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అలాగే ఖరీఫ్‌ సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధకశాఖ జేడీ ప్రేమ్‌చంద్‌, అధికారులు పాల్గొన్నారు.

లక్ష్యాలు పూర్తి చేయాలి

అనంతపురం అర్బన్‌: కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ డీఆర్‌డీఏ, మెప్మా అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూణాలు పొందిన పీఎంఎఫ్‌ఎంఈ యూనిట్లు గ్రౌండింగ్‌ కావాలని చెప్పారు. మండలానికి ఐదు యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఎఫ్‌పీఓలు, సమీకృత ఫార్మింగ్‌ క్లస్టర్ల సర్వే, కస్టమ్‌హైరింగ్‌ సెంటర్లు, తదితర అంశాలపై సమీక్షించారు. సీ్త్రనిధి పారామీటర్లకు సంబంధించి ఏపీఎంలతో రోజూ సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

‘సర్‌’లో 3.53 లక్షల ఫారాల పంపిణీ

అనంతపురం అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు ఓటర్లకు 3,53,890 ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలు పంపిణీ చేశారని కలెక్టర్‌ ఆనంద్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉనారన్నారు. 2,226 మంది బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించి, వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు.

కలెక్టర్‌ ఆనంద్‌

ఆరుతడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి

కరువు ప్రణాళికలు, ఉపశమన చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ ఆనంద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement