● డీఆర్‌ఓ మలోలకు ప్రభుత్వం ఆదేశం
అనంతపురం అర్బన్: ‘సీరియస్ మీటింగ్‌లో రమ్మీ’ అడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై డీఆర్‌ఓ మలోల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. 10 రోజుల్లోగా లిఖితపూర్వక వాదన పత్రాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనవరి 20న ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లాకు విచ్చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించడంతో పాటు ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్‌ఓ మలోల తన మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని దుష్ప్రవర్తనగా ప్రభుత్వం పరిగణిస్తూ వివరణ కోరింది. అంగీకరించబడని అభియోగ అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి ప్రతి అభియోగ అంశాన్నీ ప్రత్యేకంగా అంగీకరించాలి లేదా తిరస్కరించాలని ఆదేశించింది. నిర్దేశించిన వ్యవధిలో లిఖితపూర్వక వాదన సమర్పించని పక్షంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


