సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ‘సర్’ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ‘ఎస్‌ఐఆర్ (సర్)’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు ఉన్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయినవారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లూ తిరిగి వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తే.. వాటిని పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14వ తేదీకే అనంతపురం జిల్లాలో 77.55 శాతం మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బీఎల్‌ఓలు ఏంటికి వెళ్లారు.. ఎవరిని విచారించారు.. అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకూ తెలీదు. మీడియాకు సమాచారమూ లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్‌ను బీఎల్‌ఓలు ఎలా చేశారు.. అందులో పారదర్శకత ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఒత్తిడితోనే హడావుడి మ్యాపింగ్
ఓ జిల్లా అధికారి ఒత్తిడితోనే ఓటరు మ్యాపింగ్‌ను హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే స్వయంగా చెబుతున్నారు. ‘ఏం చే స్తాం సార్. మాపై అలాగే ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం’ అని చెబుతున్నారు. ఇప్పటికే 77.55 శాతం పూర్తయింది. అంటే మిగిలింది 22.45 శాతం మాత్రమే. రాయదుర్గంలో 82.73, ఉరవకొండలో 73.18, తాడిపత్రిలో 76.94, శింగనమల 79.80, కళ్యాణదుర్గం 78.11, రాప్తాడు (అనంతపురం జిల్లాలోని పరిధి) 73.29 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మ్యాపింగ్‌లో కుట్రకోణం
మ్యాపింగ్ ముందుగా చేయడంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. మొదట ఓట్లు మ్యాపింగ్ చేస్తే ఆపై రాజకీయపార్టీల పరిధిలోని బీఎల్‌ఏలు అభ్యంతరాలు ఉంటే లేవనెత్తుతారు. అప్పుడు ఓట్లు తొలగిద్దామనే ఆలోచనను అధికారులు చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన అధికారపార్టీ బీఎల్‌ఏలు ఇచ్చిన జాబితా ప్రకారం ఓట్లు తొలగిస్తే.. విపక్షపార్టీల ఓట్లు మాత్రమే గల్లంతయ్యే అవకాశం ఉంది.
పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం
ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్ పరిధిలోకి ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి.
చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి.
జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఉన్నాయి. అంతర్రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా గుర్తిస్తారు. డబుల్ ఓట్లు తేలితే అప్పుడు ఫాం–ఏ, బీ ఇచ్చి.. ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి.
సెప్టెంబర్ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 అనేది నిరంతర ప్రక్రియ.
ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పొలింగ్‌శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్ చేసినట్లు చేస్తే ‘సర్’ చేసినా ప్రయోజనం ఉండదు.
అనంతపురం నియోజకవర్గంలో 2002లో ఉన్న ఓట్లు 1,86,925. ఈ ఓట్లు 2025కు 2,82,463కు పెరిగాయి. ప్రస్తుతం మ్యాపింగ్ చేసిన ఓట్లు 1,86,214. ఇక మ్యాపింగ్ చేయాల్సింది 96 వేలపై చిలుకు ఓట్లు. ఇక్కడ 65.93 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 2002లో రాప్తాడు.. అనంతపురం నియోజకవర్గంలోనే ఉండేది. అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా పెరిగింది. కొత్త ఓటర్లు భారీగా చేరారు. రాప్తాడు పూర్తిగా దూరమైంది. ఉద్యోగులు, బదిలీలతో పాతవారు వెళ్లడం, కొత్తవారు చేరడం ఇక్కడ అధికం. అయినప్పటికీ దాదాపు 66 శాతం మ్యాపింగ్ చేశారు. ఇది నమ్మశక్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
‘సర్’ సర్వేపై రాజకీయపార్టీల్లో సందేహాలు
ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు
14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 77.55 శాతం పూర్తి చేసిన అధికారులు
రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో మ్యాపింగ్ కాని వైనం
ఓ జిల్లా అధికారి ఒత్తిడితో ఓటరు జాబితాలు పెట్టుకుని ఇంటిపేరు పోలితే చాలు మ్యాపింగ్


