ప్రపంచం సాంకేతికంగా ఎంత వేగంగా పరుగులు తీస్తుందో.. ప్రకృతి అంతే వేగంగా తన సమతుల్యాన్ని కోల్పోతోంది. విలాసవంతమైన జీవనశైలి, విచక్షణారహిత ప్రకృతి వినియోగం, అడవుల నరికివేత, భూగర్భ జలాల అధిక వినియోగం, రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వంటి కారణాలు పర్యావరణాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, కరువులకు మారుపేరుగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాపై మరింత తీవ్రంగా పడుతోంది.
● మానవాళి మనుగడకే పెను ముప్పుగా ‘సాంకేతిక’ జీవనం
● ఉమ్మడి అనంత జిల్లాపై తీవ్ర ప్రభావం
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను పరిశీలిస్తే కరువు ఇక్కడ కొత్త కాదు. దశాబ్దాలుగా ప్రతి రెండో లేదా మూడో ఏడాది అనావృష్టి పరిస్థితులు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. మధ్య మధ్యలో అతివృష్టి రూపంలో కురిసే భారీ వర్షాలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి రైతుల జీవనాధారం ప్రధానంగా వర్షాధార వ్యవసాయమే. వేరుశనగ సాగు జిల్లాకు గుర్తింపుగా నిలిచినా, వాతావరణ మార్పుల కారణంగా రైతులు క్రమంగా చీనీ, దానిమ్మ, అరటి వంటి వాణిజ్య పంటల వైపు మళ్లాల్సి వచ్చింది. అయితే ప్రకృతి అనిశ్చితి పెరుగుతుండడంతో ఆ పంటలూ రైతుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి.
భూగర్భ జలాలపై పెరిగిన భారం..
వానలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రైతులు భూగర్భ జలాలపై ఆధారపడ్డారు. బోర్లు తవ్వి సాగు సాగించినా, క్రమంగా నీటి మట్టాలు వందల అడుగుల లోతుకు పడిపోయాయి. ఒకప్పుడు కొద్ది అడుగుల్లో లభించిన నీరు నేడు వేల అడుగుల లోతులో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బోర్లు వట్టిపోతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. చివరకు రైతు జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగానే మిగిలిపోయాయి.
అటకెక్కిన ఎడారీకరణ
నివారణా పథకాలు..
అనంతపురాన్ని ఎడారీకరణ నుంచి కాపాడేందుకు గతంలో పలు పథకాలు రూపొందించారు. వాటర్‌షెడ్ కార్యక్రమాలు, చెక్‌డ్యాంల నిర్మాణం, భూసార పరిరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అనేక పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో వ్యవసాయాన్ని కాపాడాలంటే సాంప్రదాయ పద్ధతుల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక విత్తనాల వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సహజ వ్యవసాయం,పంటల వైవిధ్యం, చెట్ల పెంపకం వంటి చర్యలు మాత్రమే స్థిరమైన పరిష్కారాలుగా నిలుస్తాయి.
కణేకల్లు మండలంలో ఎడారీకరణ ప్రభావంతో పొలాల్లో ఇసుక మేటలు
సందర్భం
నేడు ప్రపంచ
కరువులు–
ఎడారి నివారణా దినోత్సవం


