యాడికి: తండ్రి అందనంత దూరం వెళ్లిపోయాడు. ప్రేమగా చూసుకునే తల్లి జైలు పాలైంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే అడుగంటాయి. తల్లిదండ్రులు దూరమై ప్రేమ కరువై అమాయకంగా చూస్తున్న ఆ నలుగురు పిల్లలను చూసి కన్నీరు పెట్టని వారు లేరు. యాడికి మండలంలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న శివప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన శివప్రసాద్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తుండడం, తనను, నలుగురు పిల్లలను సరిగా చూసుకోకపోవడానికి తోడు తాగొచ్చి గొడవకు దిగడంతో క్షణికావేశంలో భార్య హైమావతి రోకలి బండతో అతని తలపై బాదడంతో మరణించాడు. ఈ క్రమంలో నిందితురాలిని సోమవారం పోలీసులు అరెస్టు చేయగా, నలుగురు పిల్లలు అనిత (ఫస్ట్ ఇయర్), నాగవర్దిని (8వ తరగతి), వినిత (6వ తరగతి), కంబగిరి రాముడు (3వ తరగతి) అనాథలయ్యారు. పిల్లల దీన స్థితిని కళ్లారా చూసిన సీఐ శ్రీనివాసులు స్థానిక అగాపే వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పసాద్‌కు పిల్లల బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆశ్రమం వద్దకు పిల్లలను తీసుకొచ్చి ప్రసాద్ భోజనం వడ్డించగా, బాధను దిగమింగుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నం తింటున్న వారిని చూసి అందరి కళ్లు చెమర్చాయి. కాగా, గతంలో శివప్రసాద్ తన కుటుంబాన్ని బాగానే చూసుకునే వాడని, మద్యానికి బానిసయ్యాక ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడని పలువురు చెప్పడం చూస్తే, ‘మత్తు’ అనేది బతుకులను ఎంతలా చిత్తు చేస్తుందో అర్థమవుతుంది. ప్రస్తుతం వీధివీధినా దొరుకుతున్న మద్యానికి అలవాటు పడి, కుటుంబాలను గాలికి వదిలేస్తున్న మందుబాబుల్లో ఈ దీనగాథను చూశాకైనా మార్పు వస్తుందో లేదో చూడాలి!
హైమావతిని అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాసులు
నలుగురు చిన్నారులతో అగాపే వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రసాద్


