రాప్తాడు రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ఓట్ల గల్లంతుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని, దీనివల్ల వేలాది మంది ఓటర్ల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా మ్యాపింగ్ సగటు 80 శాతం దాటితే, పాపంపేటలో మాత్రం కేవలం 30 శాతం మాత్రమే నమోదవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాపంపేట నలుగురు బీఎల్‌ఓలు ఇప్పటివరకు విధులకు హాజరుకాలేదని, వారిస్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న కొందరు బీఎల్‌ఓలకు కూడా పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతోందన్నారు.
ఓటర్లు అప్రమత్తం కావాలి
ముఖ్యంగా పాపంపేటలోని 76, 77, 80, 82 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓట్లు కలిగి ఉన్నవారు, అక్కడ నివాసాలు లేదా ఆస్తులు ఉన్నవారు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ భవిష్యత్తు. మీ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కలిగే నష్టాన్ని అంచనా వేయలేరు. ప్రతి ఒక్కరూ బీఎల్‌ఓలను కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ దృష్టికి సమస్య
వివిధ ప్రాంతాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో లేకపోవడం, ఓటరు జాబితా మ్యాపింగ్ ఆశించినస్థాయిలో జరగకపోవడంపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాపంపేటలోని 76, 77, 80, 82 బూత్‌లతో పాటు ఆలమూరు 68, ఆకుతోటపల్లి 109, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి 130, ఆత్మకూరు మండలం బి.యాలేరు 31 పోలింగ్ స్టేషన్‌లలో మ్యాపింగ్ నెమ్మదిగా సాగుతోందని వివరించారు. మొత్తం 17 పోలింగ్ స్టేషన్లలో 30 శాతం కన్నా తక్కువ స్థాయిలోనే మ్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాప్తాడు ఈఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ ఆనంద్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు.
పాపంపేటలో 33 శాతం మాత్రమే మ్యాపింగ్
ఓటును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


