సర్‌.. అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

సర్‌.. అప్రమత్తంగా ఉండండి

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

అనంతపురం అర్బన్‌/ రాయదుర్గం టౌన్‌: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌) ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. బీఎల్‌ఓలు జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ మాదిరిగా కాకుండా ప్రత్యేక సమగ్ర సర్వే (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో బీఎల్‌ఓలు ప్రతి ఓటరునూ కలుస్తారు. 2002 ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలిస్తారు. ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం ఇచ్చి వివరాలను సేకరిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 20.38 లక్షల ఓటర్లు ఉంటే అందులో 4.57 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు. దీంతో ఈ ఓటర్లను తొలగించే అవకాశం ఉంది.

జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు..

జిల్లాలో ప్రస్తుతం 2,226 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 20,38,523 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 10,06,651 మంది, మహిళా ఓటర్లు 10,31,611 మంది, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 256 మంది ఉన్నారు. బీఎల్‌ఓల ఇంటింటి సర్వే ప్రకారం కొత్తగా నమోదైన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సెప్టెంబరు 18వ తేదీలోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

మ్యాపింగ్‌ కాని ఓటర్లు 4.57 లక్షలు..

జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 15,80,798 మంది ఓటర్లు మ్యాపింగ్‌ అయ్యారు. మ్యాపింగ్‌ కాని ఓటర్లు 4,57,725 మంది ఉన్నారు. అత్యధికంగా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 96,249 మంది రాప్తాడులో 67,534 మంది ఓటర్లు, ఉరవకొండ 60,659 మంది, తాడిపత్రిలో 58,081 మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు. అదే విధంగా రాయదుర్గంలో 46,009 మంది ఓటర్లు, గుంతకల్లులో 27,494 మంది, శింగనమలలో 50,572 మంది, కళ్యాణదుర్గంలో 51,127 మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు. మ్యాపింగ్‌ కాని ఓటర్లు ‘ప్రస్తుతం అందుబాటులో లేరు’ అనే కారణంతో తొలగించే అవకాశం ఉంది.

బీఎల్‌ఏలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..

సర్‌ ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌ఓ)కి సహకరించాలి. తమ బూత్‌ పరిధిలో మ్యాపింగ్‌ కాకుండా ఉన్న ఓటర్లను మ్యాపింగ్‌ చేయించాలి. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించకుండా చూడాలి. అదే విధంగా వయసు 18 ఏళ్లు నిండిన వారి ఓటు నమోదు చేయించాలి.

నేటి నుంచి ‘సర్‌’

జూలై 14 వరకు ఇంటింటికీ బీఎల్‌ఓలు

జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా

సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

జిల్లాలో మ్యాపింగ్‌ కాని ఓటర్లు

4.57 లక్షల మంది

రాయదుర్గం పట్టణానికి చెందిన నూరుల్లా అనే వ్యక్తి గుంటూరులో వివాహం చేసుకున్నాడు. తన భార్యకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. కానీ 2002లో నివాసం ఉన్న గుంటూరులో తల్లిదండ్రుల చిరునామాను (ఓటు సీరియల్‌ నంబర్‌ లేదా డోర్‌ నంబర్‌, ఎపిక్‌ కార్డు నంబర్‌) ప్రస్తుతం జాబితాకు సరిపోలిస్తే సరిపోతుంది. ఒక వేళ వారు బీఎల్‌ఓ ఇచ్చిన ఫారంలో ధ్రువీకరణ ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. సర్‌ అంటే కేవలం మ్యాపింగ్‌ ప్రక్రియ మాత్రమే కాదు. కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుపై కూడా జరుగుతుంది. అవగాహన, అప్రమత్తతోనే ఓటు హక్కును పరిరక్షించుకోగలం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement