నేడు ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘పరిష్కార వేదిక’

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలపై రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. కాల్‌ సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలియజేశారు.

టీబీ డ్యాంకు

329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్‌, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఆదివారం 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. టీబీ డ్యాంలో మొత్తం 9,910 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువన ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో తొలిసారిగా ఆదివారం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 6,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండి, జలాశయంలో 26.140 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జలాశయంలో 1,588.61 అడుగల వద్ద 9.910 టీఎంసీల నీరు నిల్వతో 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 180 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1603.33 అడుగుల నీటి మట్టంతో 26.410 టీఎంసీల నీరు నిల్వ ఉండి, 6,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 128 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండేందని బోర్డు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరి దుర్మరణం

మడకశిర రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మడకశిర మండలంలోని తడకలపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన గంగరాజు కుమారుడు మహేంద్ర (24), అతని బావ, రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ఆదినారాయణ (28)తో పాటు మరో యువకుడితో కలిసి ఆదివారం కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో తడకలపల్లి వద్ద 544–ఈ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్ర, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలైన మరో యువకుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణకు భార్య మమత, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మడకశిర మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో

గంజాయి సరఫరాదారులు

గుత్తి: గుత్తి పోలీసులు ఆదివారం రాత్రి ఇద్దరు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పట్టణంలోని ఓ షాపులో గంజాయి, నకిలీ నోట్లు దొరికాయి. షాపు నిర్వాహకుడిని విచారించగా.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్‌ వాటిని ఇక్కడ ఉంచినట్లు చెప్పాడు. దీంతో గోపాల్‌తో పాటు దిమ్మగుడికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ లోతుగా విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement