అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది సాగు ఊహకందని విధంగా అనూహ్యంగా పెరిగిపోయింది. అంచనాలకు మించి పంట సాగు చేస్తున్నారు. పెరిగిన పంట పెట్టుబడులతో వేరుశనగను బాగా తగ్గించేసి, ఎక్కువ మంది రైతులు కంది సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. 2019–2024 మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామం యూనిట్‌గా కంది పంటకు ఉచితంగా పంటల బీమా అమలు చేసి.. పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వడంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. బీమా చరిత్రలో ఎపుడూ లేని విధంగా ఎకరాకు రూ.10 వేలకు పైగా పరిహారం జమ చేశారు.
గత ఏడాది తొలిసారిగా..
గత ఖరీఫ్ (2025)లో కంది సాధారణ సాగు 55 వేల హెక్టార్లుగా అంచనా వేయగా.. సీజన్ ముగిసేసరికి అంచనాకు మించి ఏకంగా 1.37 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. 30 యేళ్ల జిల్లా వ్యవసాయ చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను వెనక్కినెట్టి కంది పంట అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి కూడా చాలా మంది రైతులు కంది సాగుపై దృష్టి సారించడంతో బహిరంగ మార్కెట్‌లో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం అందించే పాతకాలపు ఎల్‌ఆర్‌జీ రకాలు కాకుండా హైబ్రిడ్ విత్తన రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత, చీడపీడలు, మార్కెటింగ్ సమస్యతో వేరుశనగ తగ్గించేసి కందిపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కందికి పంట రుణం కింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.30 వేలు ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) గతేడాది క్వింటా రూ.8 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,450కు పెంచారు.
కేరాఫ్‌గా వజ్రకరూరు..
కంది పంటకు కేరాఫ్‌గా వజ్రకరూరు మండలం నిలిచింది. పోయిన ఖరీఫ్‌లో మండల వ్యాప్తంగా మొత్తం వర్షాధారిత సాగు భూమి 25 వేల హెక్టార్లు ఉండగా, అందులో 22 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో రైతులు కంది సాగు చేయడం విశేషం. మండలంలో 7,900 హెక్టార్లలో రావచ్చని ముందస్తు అంచనాలను తారుమారు చేసి గ్రామగ్రామానా కంది సాగు చేశారు. గుంతకల్లు మండలంలో కూడా 14 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం మండలంలో 13,500 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో కంది సాగులోకి వచ్చింది. బెళుగుప్ప 7,900 హెక్టార్లు, ఉరవకొండలో 7,700, విడపనకల్‌లో 7 వేలు, రాయదుర్గంలో 5,800, అనంతపురం రూరల్‌లో 5,400, గుత్తిలో 4,900, కూడేరులో 4,900, కణేకల్లులో 4,800 హెక్టార్లు, ఆత్మకూరులో 4,200 హెక్టార్లు... ఇలా చాలా మండలాల్లో కంది సాగు బాగా పెరిగింది. చాలా తక్కువగా అంటే అనంతపురం అర్బన్ పరిధిలో 25 హెక్టార్లు, యల్లనూరులో 230 హెక్టార్లు, పెద్దపప్పూరులో 376 హెక్టార్లు, నార్పలలో 615 హెక్టార్లు, పుట్లూరులో 724 హెక్టార్లలో వేశారు. మిగతా మండలాల్లో కూడా 1,200 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు కంది పంట సాగు చేశారు.
ఈ ఖరీఫ్‌లో 78,274 హెక్టార్లు అంచనా..
ఖరీఫ్‌లో కంది పంట 78,274 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఐదేళ్ల పంట సాగు లెక్కల ఆధారంగా ప్రణాళిక, వ్యవసాయశాఖ ఈ మేరకు సాధారణ సాగు కింద గుర్తించారు. ఈ సారి కూడా వజ్రకరూరులో 12 వేల హెక్టార్లు, గుంతకల్లులో 8 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గంలో 6,300 హెక్టార్లు, బెళుగుప్పలో 5 వేల హెక్టార్లు...ఇలా అన్ని మండలాల్లో కూడా కంది సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. విత్తన వేరుశనగ, ఇతరత్రా విత్తనాలు, ప్రభుత్వం నుంచి సుఖీభవ, ఇతరత్రా సాయం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సారి కూడా కంది విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జూన్, జూలైలో కురిసే వర్షాలను బట్టి పంటల సరళి తెలుస్తుందని చెప్తున్నారు.
పెరిగిన పెట్టుబడులతో వేరుశనగ తగ్గించి కందిపై రైతుల ఆసక్తి
గత ఖరీఫ్‌లో 22 వేల హెక్టార్లలో సాగు
ఈ ఏడాది 78,274 హెక్టార్లలో సాగవుతుందని అంచనా
వైఎస్ జగన్ హయాంలో
పెద్ద మొత్తంలో బీమా


