ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ విధానంలో టెట్‌ నిర్వహించాలని యూనైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉపాధ్యాయ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవేంద్రమ్మ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)లో మార్పులు తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుతం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో యూనైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ‘కిట్‌–5’ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేయడం, తదుపరి దశలో మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని, ఇప్పటికే విడుదల చేసిన టెట్‌ నోటిఫికేషన్‌తో పాటు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సహాధ్యక్షుడు రామప్ప చౌదరి , రాష్ట్ర కౌన్సిలర్‌ గోవిందరాజులు, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, కార్యదర్శులు అర్జున్‌, ప్రమీల, రవికుమార్‌, శేఖర్‌, సుబ్బరాయుడు, చంద్రమోహన్‌, రామాంజనేయులు, ఓబులేసు పాల్గొన్నారు.

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న

మహిళల అరెస్ట్‌

తాడిపత్రి టౌన్‌: పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గ్గురు మహిళలను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అలివేలమ్మ అనే మహిళ గన్నెవారిపల్లి కాలనీలో గత కొద్ది నెలలుగా అద్దెకు ఇళ్లు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆదివారం స్థానికులు 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయడంతో రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలివేలమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

బురదలోనే పశువుల సంత

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారింది. అసలే ఆదివారం పశువుల సంత కావడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో యార్డు ప్రాంగణం రొచ్చు రొచ్చుగా మారింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలు చిన్నపాటి చెరువులను తలపించాయి. వర్షపునీరు, డ్రైనేజీ సజావుగా వెళ్లడానికి సరైన సదుపాయం లేకపోవడంతో సంతకు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలతో పాటు రైతులు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షపునీరుకు పేడ, మూత్రం తోడు కావడంతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టింది. ముందు రోజు శనివారం కూడా జీవాల సంతలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంతలో సమస్య లేకుండా చూడాల్సిన మార్కెట్‌యార్డు పాలకులు, అధికారులు, సిబ్బంది మాత్రం మార్కెట్‌ రుసుం వసూలు చేసుకుని నింపాదిగా వెళ్లిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement