సాక్షి, బళ్లారి: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డకు చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. 8న మోకా పోలీసుస్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు హత్య కేసు మిస్టరీని ఛేదించారు. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బసవనగౌడ హత్య కేసును
ఛేదించిన పోలీసులు
ముగ్గురి అరెస్ట్


