అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్‌టీయూ కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అర్హత సాధించి, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తిరిగి టెట్ రాయాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే నియమించి, న్యాయమైన వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, వేతన స్కేలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ గత బదిలీలలో బదిలీ పొంది రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని అధికారులను కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, ప్రసాద్, రాజశేఖర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మల్లికార్జున, సురేష్, ఫణిభూషణ్, కృష్ణమోహన్, మల్లికార్జున గౌడ్, రవికుమార్, నాగభూషణ్, సీనియర్ నాయకులు అజయ్ కుమార్, శివయ్యచారి తదితరులు పాల్గొన్నారు.


