రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని డీఎల్‌ఆర్‌ కాలనీ సమీపంలో రైలు కిందపడి టీడీపీ కార్యకర్త, స్టోర్‌ డీలర్‌ గుద్దిటి అనిల్‌కుమార్‌ (36) శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి తెలిపిన మేరకు.. ధర్మవరం పీఆర్‌టీ వీధికి చెందిన గుద్దిటి నాగార్జున, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గుద్దిటి అనిల్‌కుమార్‌. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. డీఎల్‌ఆర్‌ కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం లోకో పైలెట్‌ ఇచ్చిన సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధా రాలు లేకపోవడంతో శవాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడు అనిల్‌కుమార్‌గా గుర్తించారు. అప్పులు ఎక్కువగా చేయడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ సీఐ రెడ్డెప్ప తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

దివ్యాంగురాలి ఆత్మహత్య

ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దివ్యాంగురాలు రాజ్యలక్ష్మి(21) ఉరివేసుకొని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. టూ టౌన్‌ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు..పట్టణంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన రామంజనేయులు, అవేట పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు రాజ్యలక్ష్మి ఉన్నారు. కూతురు పుట్టుకతోనే చెవుడు, మూగ. ఈమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement