నాగేపల్లి వద్ద ఇసుక భూముల్లో విత్తనం విత్తుతున్న రైతులు
కణేకల్లు: కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని మాల్యం, తుంబిగనూరు, నాగేపల్లి, గరుడచేడు, మీన్లహళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం తదితర గ్రామాలు వేదవతి హగరి నది ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ సుమారు 15వేల ఎకరా పట్టా భూముల్లో ఇసుక మేటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి రైతులకు వ్యవసాయమే జీవనాధారం. ఆ ఇసుకమేట వేసిన భూముల్లోనే ప్రతి ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేస్తూ వస్తున్నారు. దుక్కుల నుంచి విత్తు, కోతలు.. పంట దిగుబడులు ఇంటికి చేర్చే వరకు గాలికి లేచే ఇసుకతో రైతులకు ఇబ్బందులు తప్పవు.
వేరుశనగ విత్తు ఆరంభం
ఖరీప్ సీజన్ ప్రారంభమైంది. రెండు వారాలుగా ముందస్తు వర్షాలు కురుస్తుండటంతో మాల్యం, తుంబిగనూరు, గరుడచేడు, మీన్లహళ్లి, బిదరకుంతం, దర్గాహొన్నూరు, గోవిందవాడ తదితర గ్రామాల్లో రైతులు భూములను చదును చేసి.. ఎద్దులతో గొర్రు వేసి వేరుశనగ విత్తనాలను విత్తి ఆశల పంటకు శ్రీకారం చుడుతున్నారు. విత్తనాల విత్తే పనిలో ఈ ప్రాంత రైతులు బిజీ అయిపోయారు.
ఎగిసిపడే ఇసుకతోనే ముప్పు
ఆషాఢ గాలుల తరహాలో ప్రస్తుతం గాలులు బలంగా వీస్తుండటంతో ఇసుక మేటల ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలికి ఎగిసిపడే ఇసుక రేణువులతో వేరుశనగ పంట మొలకలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పంటను రక్షించుకోవాలంటే చుట్టూ పత్తి కట్టె, పాత చీరలతో కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
పంట రక్షణ ఇలా..
వాస్తవానికి విత్తనం విత్తిన రోజే కంచెలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే విత్తనం విత్తి అలసిపోయి ఉంటామని మరుసటి రోజు ఎన్ని పనులున్నా... మానుకొని కంచెలు వేసేస్తుంటారు. పత్తి కట్టి దొరక్కపోతే ఇళ్లలో ఉన్న పాత చీరలతో కంచె వేస్తుంటారు. కంచె వేసే విషయంలో రెండు, మూడ్రోజులు ఆలస్యం చేస్తే గాలికి ఎగిసిపడే ఇసుక రేణువుల వల్ల విత్తిన విత్తనం కొట్టుకోపోతుంది.
ఖరీఫ్ వేరుశనగ సాగుకు రైతుల సన్నద్ధం
గాలికి ఎగిసి పడుతున్న ఇసుక రేణువులు
పాతచీరలు.. పత్తి కట్టెలే రక్షణ కవచాలు


