అనంతపురం ఎడ్యుకేషన్: హనీట్రాప్ దందా జిల్లాకు ఒక మాయని మచ్చ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనీముఠాను బీజేపీ, టీడీపీలు పెంచి పోషించాయన్నారు. వారిలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఒక వర్గం వారు పోలీసులు, మీడియాకు ఉప్పందించారన్నారు. నిజాయితీగా పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది చాలామందే ఉన్నారని, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. ఎక్కువ రోజులు దర్యాప్తు జరిగితే జిల్లా ప్రతిష్ట మసకబారుతుందనే భయంతో దర్యాప్తు ఆపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అనేక మందికి ఫోన్లు వచ్చాయని, ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి అనేది పోలీసులే తేల్చాల్సి ఉందన్నారు. మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే పంపించి దర్యాప్తునకు సహకరించాలని తనకు నోటీసు అందజేశారని, సమాధానం ఇస్తానని, పిలిచినప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారు. హనీట్రాప్‌పై ప్రశ్నించే వారి గొంతు నొక్కొద్దని కోరారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న చీకటి దందాలన్నింటిపైనా కేసులు కట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేడు పట్టించుకోకపోయినా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హనీట్రాప్ దందాపై సీబీఐతో విచారణ చేయిస్తామన్నారు. సూత్రధారులను విచారించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత హేయమైన ఈ దందాపై వెనువెంటనే చర్యలు తీసుకున్న డీఐజీ, ఎస్పీకి మరోసారి అభినందనలు తెలిపారు.
ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు?
కొడిమి, ఆలమూరు జగనన్న కాలనీల్లో కంకర, బ్రిక్స్, ఇసుక, సెంట్రింగ్ సామాన్లు, పెల్లలు, ఐరన్ స్టూళ్లు ఎత్తుకెళ్లారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ప్రకాష్ రెడ్డి తెలిపారు. నరసనాయనికుంటలో దాదాపు ప్రతి టీడీపీ నాయకుడి ఇంటిలోనూ జగనన్న కాలనీ వస్తువులు కనిపిస్తాయన్నారు. ఆలమూరులో ఒక ఆటో, ఒక బొలెరో వాహనాన్ని పట్టించామన్నారు. రెండు బైకుల నంబర్లు, ఫొటోలు అందించామని, చివరకు దొంగలను కూడా పట్టించిన క్రమంలో ఏమి చర్యలు తీసుకున్నారో డీఎస్పీ చెప్పాలన్నారు. పెన్నా నదిలో రోజూ 500 ట్రాక్టర్ల ఇసుకను ఎత్తుకెళ్తున్నారని, పోలీసులకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఒక్కో క్రషర్ యజమాని నెలకు రూ. లక్షలు పరిటాల శ్రీరామ్‌కు చెల్లించాలన్నారు. టమాట మండీ నుంచి రోజు రూ. 5–6 లక్షలు శ్రీరామ్‌కు టోల్ కట్టాలన్నారు. రిటైర్మెంట్‌కు ముందు ఆర్డీఓ దందాలు చేస్తున్నాడంటూ పేపర్లలో కథనాలు వస్తున్నాయని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ధర్మవరం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా.. జైలుకు పంపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంకు వరుసగా మూడేళ్లు నీళ్లు తీసుకొచ్చి రైతులను బతికించిన చరిత్ర తమదన్నారు. అదే రైతులను ఎండబెట్టి ఊళ్లు విడిపిస్తున్న చరిత్ర పరిటాల కుటుంబానిది అంటూ దుయ్యబట్టారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు బండి పవన్ కుమార్, సాకే వెంకటేష్, బిల్లే మంజునాథ్ పాల్గొన్నారు
రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న దందాలన్నింటిపైనా కేసులు కట్టాలి
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


