● జిల్లా జడ్జి భీమారావు
రాయదుర్గంటౌన్/కళ్యాణదుర్గం: కేసుల భారాన్ని తగ్గించేందుకే అదనపు కోర్టులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. కళ్యాణదుర్గంలో రెండు, రాయదుర్గంలో ఒకటి మొత్తంగా మూడు కోర్టు భవనాలను బుధవారం వర్చువల్ విధానంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ లాంఛనంగా ప్రారంభించారు. రాయదుర్గంలో మధ్యాహ్నం జిల్లా జడ్జి భీమారావు రిబ్బన్ కట్ చేసి కోర్టు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కక్షిదారులకు సులభంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. రాయదుర్గం అదనపు సివిల్ కోర్టులో ఎఫ్‌ఏసీగా జూనియర్ సివిల్ జడ్జి రమ్య బాధ్యతలు చేపడతారన్నారు. త్వరలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు అదనపు కోర్టులు దోహదపడతాయన్నారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం జిల్లా జడ్జిని రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరెడ్డి, పృథ్వి రాజ్, సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు.
విజయవాడ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ బుధ వారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో గురు, శుక్రవారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్ పాల్గొననున్నారు. ఆయన శనివారం తిరిగి వస్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో విధులకు సోమవారం హాజరవుతారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
గుంతకల్లు–మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లు
గుంతకల్లు: గుంతకల్లు–మార్కాపురం రోడ్డు మార్గంలో ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లావాసులతో పాటు శ్రీశైలం వెళ్లే భక్తులకు రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. గుంతకల్లు–మర్కాపురం రోడ్డు (57407) రైలు మే 14 నుంచి పట్టాలెక్కుతుందన్నారు. ఈ రైలు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11.30కు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌కి చేరుకుంటుందన్నారు. మార్కాపురం రోడ్డు–గుంతకల్లు (57408) ప్యాసింజర్ రైలు మే 13 నుంచి ప్రారంభమవుతుందని, రైలు ప్రతి రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకుంటుందన్నారు. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమదేవపల్లి, కృష్ణపురం, కంభం, తర్లపాడు మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ప్రారంభోత్సవ రైలును మాత్రం ఈ నెల 12న గుంతకల్లు జంక్షన్‌లో ముఖ్య అతిథుల చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గుంతకల్లు జంక్షన్‌లో రైలు బయలుదేరి సాయంత్రం 7.30కు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌కు చేరుతుందన్నారు.


