చినుకు రాలదు.. అరక సాగదు | - | Sakshi
Sakshi News home page

చినుకు రాలదు.. అరక సాగదు

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

అనంతపురం అగ్రికల్చర్‌: బీడువారిన పొలాలను దుక్కి చేయాలంటే సరైన వర్షం పడాలి. గత ఖరీఫ్‌, రబీలో సాగు చేసిన పంట అవశేషాలు తొలగించి లోతుగా దుక్కి దున్ని జూన్‌లో కురిసే వర్షాలకు కొత్తగా పంటలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొన్న ఐదారు మండలాల్లో చిన్నపాటి వర్షం మినహా ఎక్కడా పదునయ్యే వర్షం నమోదు కాలేదు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే ప్రస్తుత వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి’ వ్యవసాయ పనులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు చేస్తున్నారు.

75 శాతం వర్షాధారం..

ఉమ్మడి జిల్లాలో 75 శాతం పొలాలు కేవలం వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతీ ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 లక్షల నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్‌ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా లేదా ఆలస్యం కావడం, త్వరగా నిష్క్రమించడం, తక్కువ వర్షాలు కురవడం, అనిశ్చితి వర్షాలు, పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం, ఒక్కోసారి విరామం లేకుండా అతివృష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే నీరు భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం రూపంలో వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహ రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి.

లోదుక్కులతో అనేక ప్రయోజనాలు..

వేసవిలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్రనేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనినే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా కోశస్థ దశలో ఉన్న పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకూ నశిస్తాయి. పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడిక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. బెట్ట ఏర్పడకుండా పంటను కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. కలుపు సమస్య బాగా తగ్గిపోతుంది. అంతేకాక గాలిలో నైట్రేట్‌ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇలా విత్తనం వేయడానికి ముందుగా రెండు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే పంట దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ ఈ సారి వరుణుడు ఇంకా కరుణించడం లేదు. అందులోనూ ‘ఎల్‌–నినో’ ప్రభావం ఉంటుందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఖరీఫ్‌ వ్యవసాయంపై రైతుల్లో అనిశ్చితి నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది తొలకరి సాగుకు వాతావరణం అనుకూలంగా కనిపించడం లేదు. జూన్‌ ఒకటి నుంచి ఖరీఫ్‌–2026 మొదలు కానుండడంతో ముంగారు సేద్యానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో పొలాలు దుక్కి చేసుకోవాల్సివుంది. అయితే మండే ఎండల కారణంగా పొలాల్లో తేమ శాతం తగ్గిపోయి భూమిలోకి మడకలు దిగనంటూ మొరాయిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ఖరీఫ్‌ సమీపిస్తున్నా

ఇంకా మండుతున్న ఎండలు

తేమ శాతం తగ్గి గట్టిపడిన పొలాలు

భూమిలోకి మడక దిగకపోవడంతో దుక్కి చేయలేకపోతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement