రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

గుంతకల్లు: ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే అండర్‌–11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులను బుధవారం గుంతకల్లులోని పెంగ్విన్‌ మాంటిస్సోరి స్కూల్‌లో ఎంపిక చేశారు. బాలుర విభాగంలో సాకేత్‌ (అనంతపురం), రత్నతేజ్‌ (తాడిపత్రి), బాలికల విభాగంలో షరోన్‌బ్లేస్సీ (అనంతపురం), హారిక చౌదరి (తాడిపత్రి) ఎంపికయ్యారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ నాగార్జున కర్టాటకం అభినందించారు.

భక్తి శ్రద్ధలతో

ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం

ఉరవకొండ: స్థానిక భగవాన్‌ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరాంబ ఆరాధనోత్సవాన్ని (బాలవికాస్‌ దినోత్సవం) అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబా అవతార ప్రకటన దివ్య క్షేత్రంలోని సత్యసాయి విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. పల్లకీ ఉత్సవంలో బాలవికాస్‌ విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం బాల వికాస్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బైక్‌ మెకానిజమ్‌పై

ఉచిత నైపుణ్య శిక్షణ

అనంతపురం: ద్విచక్ర వాహనాల మరమ్మతుపై ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బైక్‌ రిపేరీ, సర్వీసింగ్‌, ఇంజిన్‌ రిపేరీ, నైపుణ్యాభివృద్ధితో పాటు కస్టమర్‌ రిలేషన్‌, ఇంగ్లిష్‌ నైపుణ్యం, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాసంపై 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వారు, 5వ తరగతి నుంచి 10వ తరగతి పాస్‌/ ఫెయిల్‌, ఐటీఐ పాస్‌/ఫెయిల్‌, ఇంటర్మీడియట్‌ పాస్‌/ఫెయిల్‌ అయిన వారు అర్హులు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజనం ఉచితం. శిక్షణ అనంతరం ఉచితంగా టూల్‌ కిట్‌, సర్టిఫికెట్‌ అందజేయడంతో పాటు 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 99594 22884, 99487 71362లో సంప్రదించవచ్చు.

రజక విద్యార్థులకు పురస్కారాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో ప్రతిభ చాటిన రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.ఎర్రిస్వామి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో 400 పైన, ఇంటర్‌లో 700 పైన మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు సి.ఎర్రిస్వామి, 1–1–284, ఆర్కే నగర్‌, అనంతపురం చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలకు 98668 76190, 98851 12180, 90001 14624, 83412 44333 నంబర్లలో సంప్రదించవచ్చు.

మామిడి టన్ను రూ.60 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో బుధవారం టన్ను మామిడి గరిష్ట ధర రూ.60 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. బేనీషా రకం టన్ను గరిష్టం రూ.60 వేలు, కనిష్టం రూ.20 వేలు, హిమాయత్‌ రకం టన్ను గరిష్టం రూ.40 వేలు, కనిష్టం రూ.15 వేలు, మల్లికా రకం టన్ను గరిష్టం రూ.37 వేలు, కనిష్టం రూ.18 వేలతో క్రయ విక్రయాలు సాగినట్లు తెలిపారు.

వ్యక్తి దుర్మరణం

పామిడి: కారు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పామిడిలోని బ్రాహ్మణవీధిలో నివాసముంటున్న బోయ ఎస్‌ మురళి అలియాస్‌ మోషే (55)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కట్టెలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గత నెల 9న అనారోగ్యంతో భార్య మృతి చెందింది. ఈ క్రమంలో బుధవరం కట్టెల కోసమని ఆటోలో కల్లూరు వైపుగా వెళుతుండగా పెన్నానది వంతెనపై అనంతపురం వైపుగా శరవేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో మోషే అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆటో డ్రైవర్‌ కల్లూరు ఆగ్రహారానికి చెందిన పుష్పరాజ్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని జీజీహెచ్‌కు వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement