రాయదుర్గం టౌన్: స్థానిక ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం దేవేరులతో కలిసి గజ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, శ్రీవైష్ణవ, వీర శైవలింగాయత సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గజ వాహన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.
జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స
అనంతపురం: సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ బాలుడు నడిచేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన 14 ఏళ్ల లోకేష్ ఒబెసిటీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అధిక బరువుకు కాళ్లు వంకర పోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఒకవేళా నడిచినా కొంత దూరం మాత్రమే. దీంతో తల్లిదండ్రులు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం దక్కలేదు. చివరకు అనంతపురంలోని జీజీహెచ్‌లో ఆర్థో వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచనతో పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్థోపెడిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ గౌస్ నేతృత్వంలో వైద్యులు శస్త్రచికిత్స చేపట్టి వంకర కాలును సరి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బుధవారం లోకేష్ డిశ్చార్జ్ చేశారు. దీంతో లోకేష్ తల్లి పల్లవి హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్–డీ, ఏపీ హైకోర్టు–2026 పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఖుస్బూ కొఠారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయ రూ. లక్షలోపు ఉండాలి. మొత్తం 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరిలో బీసీలు 66 శాతం, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లు కేటాయిస్తారు. శిక్షణ సమయంలో స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తారు. డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ మేరకు ఎంపిక చేస్తారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం హార్డ్ కాపీలను కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 97042 04905, 95502 50770, 83090 06875 లో సంప్రదించవచ్చు.


