ఉపాధి పనులు విస్తృతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు విస్తృతం చేయాలి

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

డ్వామా పీడీ సలీంబాషా

అనంతపురం టౌన్‌: జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను విస్తృతం చేయాలని సిబ్బందిని డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. బుధవారం ఏపీఓలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మండలం యూనిట్‌గా 5 వేల మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పించాలన్నారు. మే నెలలో వ్యవసాయ పనులు ఉండవని, ఇలాంటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తూ పనులపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలకు సమీపంలోనే పనులు కల్పించేలన్నారు. ఇచ్చిన లక్ష్యానికి చేరువయ్యేలా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. వచ్చే నెలలో ఉపాధి హామి నూతన చట్టం వీబీ జీ రామ్‌ జీ చట్టం అమల్లోకి రానుందని, నూతన లేబర్‌ బడ్జెట్‌ అమల్లోకి వస్తే అందుకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలన్నారు.

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మడకశిర రూరల్‌: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మడకశిర ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2026–27 సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సరోజినిదేవి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదోతరగతి లేదా, సమాన విద్యార్హత కలిగిన వారు ఈ నెల 21వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారానికి www.angran.ac.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు. మరిన్ని వివరాల కోసం 77023 66113, 79895 71408లో సంప్రదించవచ్చు.

కొడుకు మందలింపు..

తండ్రి ఆత్మహత్య

తాడిపత్రి రూరల్‌: కన్న కొడుకు మందలింపుతో క్షణికావేశానికి లోనై ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని కృష్ణాపురం జీరో రోడ్డులో నివాసముంటున్న రామకృష్ణ (66)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుంటుండడంతో మంగళవారం చిన్న కుమారుడు భాస్కర్‌ మందలించాడు. అనంతరం తల్లి, సోదరుడితో కలిసి నంద్యాల జిల్లా జమ్మలమడుగులోని బంధువుల ఇంట జరిగే ఫంక్షన్‌కు భాస్కర్‌ వెళ్లిపోయాడు. రాత్రికి తిరిగి వచ్చారు. ఇంటికి తండ్రి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడిపత్రి – చల్లవారిపల్లి రైలు మార్గంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్న లోకో కో–పైలెట్‌ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతుడిని రామకృష్ణగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement