లోఓల్టేజీ సమస్య పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

లోఓల్టేజీ సమస్య పరిష్కరిస్తాం

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి

బొమ్మనహాళ్‌: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న లో–ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లులో రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, రూ.80 లక్షలతో చేపట్టిన పీఎం సూర్యఘర్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో కలిసి శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... లో–ఓల్టేజీ సమస్యను పరిష్కరిచేందుకు నేమకల్లులో 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 11 కేవీ సబ్‌స్టేషన్లు మూడింటిని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హనుమంతరెడ్డి, ఎంపీపీ నాగమణి, సింగల్‌విండో చైర్మన్‌ కొత్తపల్లి మల్లికార్జున, కన్వీనర్‌ బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్కా బీటర్‌ అరెస్ట్‌

గార్లదిన్నె: మట్కా రాస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ప్రొబేషనరీ ఐపీఎస్‌ అశ్విన్‌ మణిదీప్‌ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. మట్కా నివారణలో భాగంగా మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అబ్దుల్‌ అనే వ్యక్తి శివాలయం వద్ద బహిరంగ ప్రదేశంలో మట్కా రాస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి మట్కా పట్టీలు, రూ.51,960 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృతి

బొమ్మనహాళ్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్‌ మండలం ఏలంజి గ్రామానికి చెందిన గాదిలింగమ్మ, గంగన్న దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (19) చేతి బోరు పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరికొందరితో కలిసి కొలగానహళ్లి గ్రామంలో రైతు చిరంజీవి పొలంలో చేతి బోరు వేసేందుకు శుక్రవారం వెళ్లాడు. బోరు వేస్తున్న సమయంలో ఇనుప పైపును పైకి ఎత్తుతున్న సమయంలో పైనున్న 11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వన్పూరుస్వామిని స్థానికులు బళ్లారిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వన్నూరు స్వామికి ఇటీవల వివాహ నిశ్చయమైంది. మరో మూడు నెలల్లో పెళ్లి ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఇలాంటి తరుణంలో కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది.

టీసీసీ ఫలితాల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: గత ఫిబ్రవరిలో జరిగిన టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ–2026) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. డ్రాయింగ్‌, హ్యాండ్లూమ్‌, వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి మార్కుల జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement