అనంతపురం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. నగరంలోని ఏ–7 ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా విభాగం జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరుదు కళ్యాణి, మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి, విశిష్ట అతిథిగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. తొలుత దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళా సాధికారితకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో మహిళలకు సంక్షేమ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2019–2024 వరకు జగనన్న పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అడుగడుగునా బెల్టుషాపులు వెలిశాయని, మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, దాష్టీకాలు పెరిగిపోతున్నా అడ్డుకట్ట వేయకుండా చోద్యం చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, సంక్షేమం, మహిళల భద్రత పట్టని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రతి మహిళా ఆదిపరాశక్తిగా మారాలన్నారు. మహిళా సాధికారత – సంక్షేమం, జనరంజక పాలన కోసం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచే వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, యాడికి లక్ష్మిదేవి, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ శశికళరెడ్డి, శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి దేవి, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాతరెడ్డి, రాధాయాదవ్, మహిళా నేతలు సుహాసిని, భారతి, అంజలి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనూరాధ, మేరీ నిర్మల, నియోజకవర్గ అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, పార్వతి, వరలక్ష్మి, ఓబుళమ్మ, నాగలక్ష్మి, ఉష, రేవతి, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ శిల్ప, పద్మ, మహేశ్వరి, ప్రసన్న, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ తదితరులు
సదస్సుకు హాజరైన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు
చంద్రబాబు పాలనలో మహిళలపై మితిమీరుతున్న దౌర్జన్యాలు
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజం


