యాడికి పీహెచ్‌సీని మోడల్‌గా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

యాడికి పీహెచ్‌సీని మోడల్‌గా తీర్చిదిద్దుతాం

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

యాడికి: మండల కేంద్రం యాడికిలోని పీహెచ్‌సీని మోడల్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మంగళవారం ఆయన పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మోడల్‌ పీహెచ్‌సీగా తీర్చిదిద్దిన తర్వాత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైద్యులు పరమేశ్వర, సుమంత్‌రెడ్డి, తాడిపత్రి మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సక్రమంగానే 12 నామినేషన్లు

అనంతపురం అగ్రికల్చర్‌: పట్టు పరిశ్రమశాఖ ఉద్యోగుల పరపతి సంఘం ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. నగరంలోని పట్టుశాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సొసైటీ కార్యాలయంలో ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ నవాజ్‌ సమక్షంలో పరిశీలించిన తర్వాత సోమవారం ఏడు డైరెక్టర్‌ స్థానాలకు సమర్పించిన 12 మంది నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. నామినేషన్లు వేసిన వారిలో ఆ శాఖ ఉద్యోగులు సి.ఆదినారాయణరెడ్డి, జి.బసవరాజు, ఆర్‌వీ శివప్రసాద్‌, కె.బాబయ్య, జి.రామలింగారెడ్డి, బి.గోవిందప్ప, డి.ఓబులేసు, ఎస్‌.సిద్ధప్ప, వై.ఆదినారాయణ, వి.బాబా ఫక్రుద్ధీన్‌, పి.రామాంజినేయులు, బి.నాగార్జున ఉన్నట్లు తెలిపారు. విత్‌డ్రా తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించి గుర్తులు కేటాయిస్తామని తెలిపారు. 11న సొసైటీ కార్యాలయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌ తర్వాత అదే రోజు ఎన్నికై న ఏడుగురు డైరెక్టర్లను ప్రకటించనున్నట్లు తెలిపారు.

రెండోరోజు ప్రశాంతంగా మూల్యాంకనం

అనంతపురం ఎడ్యుకేషన్‌: నగరంలోని కేఎస్‌ఆర్‌ బాలికల ఉన్నతపాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం రెండోరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు చాలామంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు రిపోర్టు చేసుకోకుండా వివిధ సమస్యలతో ఉత్తర్వులు రద్దు చేయించుకోగా.. తక్కినవారు ఆసక్తి చూపలేదు. దీనికితోడు సర్వర్‌ సతాయించి మార్కుల ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌కు తీవ్ర ఆటంకం కలగడంతో మూల్యాంకనంలో గందరగోళం నెలకొంది. రెండోరోజు మంగళవారం సమస్యలు అధిగమించారు. అవసరమైన సీఈ,ఏఈ,ఎస్‌ఏలను నియమించారు. ట్యాబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిపుణులతో చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిశీలకులు, జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. డీఈఓ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో మార్కుల అప్‌లోడ్‌ చేసే సమమంలో జాగ్రత్తగా పరిశీలించాలని స్పెషల్‌ అసిస్టెంట్లను ఆదేశించారు.

గ్రేడ్‌–2 హెచ్‌ఎంల తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జోన్‌–4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌, కర్నూలు పూర్వ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించిన స్కూల్‌ అసిస్టెంట్లు, సమాన హోదా కల్గిన టీచర్లకు గ్రేడ్‌–2 హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాబితాను కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ https:// rjdse kadapa. blogspot.com లో ఉంచినట్లు పేర్కొన్నారు. సంబంధిత టీచర్లు తమ సర్వీసు వివరాలు, సీనియార్టీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో కార్యాలయ అధికారిక ఈమెయిల్‌ rjdsekadapa@ apschooledu.in ద్వారా ఈనెల 11లోగా అందజేయాలన్నారు. ఆ తర్వాత అందిన అభ్యంతరాలు పరిశీలించబడవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement