అనంతపురం క్రైం: మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సర్కార్ వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగియగా ప్రత్యేక అధికారులకు పాలన అప్పగించిన ప్రభుత్వం.. ఎన్నికల అంశాన్ని మాత్రం నాన్చుతోంది. అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఒక్క పథకమూ సరిగా అమలు చేయకపోవడం.. సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్‌గా మారడంతో జనం చంద్రబాబు సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో చాలాచోట్ల పరిశుభ్రత లోపించింది. రోడ్లపైనే మురుగు పారుతోంది. చెత్త సేకరణ సరిగా జరగక వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇక సంక్షేమ పథకాల అమలు కూడా మున్సిపాలిటీల్లో సరిగా లేదు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే బొక్కబోర్లా పడతామని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు జనగణనలో నిమగ్నమై ఉన్నారని, అందువల్ల వార్డుల పునర్విభజన సరిగా జరగదంటూ సాకులు చూపుతూ మున్సిపల్ ఎన్నికల వాయిదాకు సిద్ధమైంది.
గడువు పొడిగింపు
మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగమైన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) పనులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీల్లో డీలిమిటేషన్ పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ముందుగా జారీ చేసిన షెడ్యూల్‌ను సవరిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ శాఖ కొత్త సర్కులర్ విడుదల చేసింది. ఈ మేరకు కమిషనర్ – డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషనన్ కార్యాలయం నుంచి మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేయకుండా సవరించి, కొత్త గడువులతో అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లు తగిన విధంగా ప్రాథమిక నోటిఫికేష్‌న్ తయారీ, ఫీల్డ్ వెరిఫికేషన్, సరిహద్దుల ఖరారు వంటి ప్రక్రియలను పూర్తి చేసి తదుపరి దశలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.
కమిషనర్లపై నెపం నెడుతూ...
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం 2027 జనగణనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల వార్డుల పునర్విభజన పనుల పురోగతి ప్రభావితమవుతోందని మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వం దృష్టికి తీసువచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ తయారీకి అవసరమైన ఫీల్డ్ స్థాయి సమాచారం సేకరణ, జనాభా గణాంకాల ధ్రువీకరణ వంటి ప్రక్రియలు సకాలంలో పూర్తి కావడం కష్టంగా మారిందని వారు నివేదించారని పేర్కొంటోంది. ఈ నివేదికల ఆధారంగానే వార్డుల పునర్విభజన అంశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ముడు ముక్కలాటతోనూ ముప్పే
ప్రస్తుతం కూటమి నాయకుల్లోనూ ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం తమదని.. అంతా తామేనంటూ టీడీపీ నేతలు గొప్పలు చెబుతుండగా...జనసేన, బీజేపీ నేతలు తామేం తక్కువ కాదన్నట్లు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఫలానా వార్డు సీటు తమదంటే తమకేనంటూ మూడు పార్టీల నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీంతో గ్రూపు రాజకీయాలను చక్కదిద్దకుండా మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్తే కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలే తమను ఓడిస్తారని టీడీపీ నేతలు తమ అధినేత వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం వార్డుల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు సిద్ధమైందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వార్డుల పునర్విభజన పేరుతో గడువు పొడిగింపు
డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ నుంచి ఉత్తర్వులు
కూటమి నేతల ఆధిపత్య పోరు.. పథకాల అమలులోనూ అట్టర్ ప్లాప్
ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే భారీగా నష్టపోతామని బెదురు


