● ఈ నెల 25న ఔత్సాహికులకు అవగాహన సదస్సు
అనంతపురం అగ్రికల్చర్: పాడి, మాంసం ఉత్పత్తుల తయారీలో భాగంగా ఆహార శుద్ధికి సంబంధించి చిన్నపాటి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను అందజేయనున్నారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ పి.ప్రేమ్‌చంద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమ బద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) కింద ఆసక్తి ఉన్న పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సమృద్ధి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాజెక్టు విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 90 శాతం బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తారు. ఇందులో 35 శాతం రాయితీ వర్తిస్తుంది. పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, కోవా, తదితర పాడి అనుబంధ ఉత్పత్తులు, ఇతర మాంస ఉత్పత్తుల యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుంది. వీటికి సంబంధించి ఈ నెల 25న అనంతపురంలోని పశుశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు ఉంటుంది. ఔత్సాహికులు, ఆసక్తి ఉన్న వారు సదస్సుకు హాజరై అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.
యుద్ధోన్మాదం నశించాలి
● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం టవర్‌క్లాక్: ప్రపంచ దేశాల శాంతియువత జీవనానికి ప్రమాదకరమైన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం నశించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి వర్ధిలాలనే అంశాలపై సోమవారం అనంతపురంలోని ఎన్జీఓ హోంలో సీపీఐ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత వహించారు. రామకృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ తదితరులు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని దేశ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా చేస్తున్న దాడులు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, శ్రీరాములు, కేశవరెడ్డి, రామకృష్ణ, పద్మావతి, నారాయణస్వామి, రాయుడు, కుళ్లాయిస్వామి, కోట్రేస్ తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని
వృద్ధుడి మృతి
తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం బుక్కపట్నంకు చెందిన ఆదినారాయణరెడ్డి (65) మృతి చెందాడు. వ్యక్తిగత పనులపై తాడిపత్రికి వచ్చిన ఆయన పని ముగించుకుని తిరుగు ప్రయాణమై రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


