అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలోని శిల్పారామంలో చేతివృత్తులు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. కుందుర్పి కోటకు సంబంధించి మెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గుత్తి కోటకు నడక మెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో గుర్తించిన చారిత్రాత్మక ప్రదేశాలు, స్థలాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంత సాగరం చెరువులో బోటింగ్ సదుపాయాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా పర్యాటక అధికారి జయకుమార్‌బాబు, డ్వామా పీడీ సలీంబాషా, ఆర్కియాలజీ ఏడీ స్వామి నాయక్, నగర పాలక సంస్థ ఎస్‌ఈ రాజశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, మెప్మా పీడీ విశ్వజ్యోతి, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి
దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, శెట్టిబలిజలకు ఆయన ఆరాధ్యుడని కలెక్టర్ ఓ.ఆనంద్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పుష్పాంజలి ఘటించి, మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, శెట్టిబలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మగౌరవం కోసం వెంకటరెడ్డి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ ఎ.మలోల, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూకొఠారి. బీసీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డి, జిల్లా పర్యాటక అధికారి జయకుమార్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం


