ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జవహర్ నాలెడ్జ్ (జేకేసీ) ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెడ్ ఫ్లస్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ మేళాకు ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫార్మసిస్ట్ పోస్టుకు డీ–ఫార్మసీ పూర్తి చేసి కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికై న వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఫార్మసీ ఎయిడ్ పోస్టుకు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. నెలకు రూ18,885 నుంచి రూ. 22 వేలు వేతనం చెల్లిస్తారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుకు పది, ఇంటర్ చదివిన వారు అర్హులు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. నెలకు రూ17,586 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 98664 17491 లో సంప్రదించవచ్చు.
విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించండి
కుందుర్పి: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు తాగునీరు అందక నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఆ పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్ధార్ ఓబుళేసును కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. పాఠశాలలో 481మంది విద్యార్థులు ఉన్నారని, మధ్యాహ్న భోజనం తర్వాత గుక్కెడు నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య నెలకొందన్నారు. సమస్యను పరిష్కరించి, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
రేపు డీసీఎంఎస్
వార్షిక మహాజనసభ
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్) వార్షిక మహాజనసభ ఈ నెల 25న ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఎం.సత్యనారాయణరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు డీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే మహాజనసభకు సభ్యులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది డీసీఎంఎస్ బ్రాంచీల ద్వారా సాధించిన ప్రగతి, వ్యాపార లావాదేవీలు, జమా ఖర్చులు తదితర వాటిపై చర్చించి... అధ్యక్షుడు నెట్టెం వెంకటేశులు నిర్ణయం మేరకు మిగిలిన అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
రైల్వే డివిజన్ పరిధిలో
పలువురికి అవార్డులు
గుంతకల్లు: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు రైల్వే ఉద్యోగులకు మ్యాన్ అఫ్ మంత్ అవార్డులతో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో ట్రాక్ మెన్ అమిత్, పాయింట్స్‌మెన్ రమేష్‌మీనా, టెక్నిషియన్ దాదాహయత్ ఉన్నారు. వీరికి సోమవారం డీఆర్‌ఎం కార్యాయలంలోని మీటింగ్ చాంబర్‌లో ప్రశంసా పత్రాలను డీఆర్‌ఎం సీఎస్ గుప్తా అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


