అనంతపురం: నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆనంద్‌ను వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆకాల వర్షాలు, ఈదురుగాలులకు ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప, కూడేరు మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి విపత్తు కారణంగా రూ. కోట్లలో నష్టాన్ని రైతులు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. 400 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. బెళుగుప్ప మండలం అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం, కూడేరు మండలం ముద్దలాపురం గ్రామాల్లో తాను పర్యటించి రైతులతో మాట్లాడి వివరాలను సేకరించానని, రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు వివరించారని పేర్కొన్నారు. పంటలు చివరి దశలో ఉండగా దెబ్బతినడంతో నష్ట తీవ్రత భారీగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నష్టం అంచనాలను పునఃసమీక్షించి రైతులకు న్యాయం చేకూరేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని, మద్దతు ధర క్వింటాకు రూ.2,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నాయకులు మచ్చన్న, హనుమంతరాయుడు, రుద్రానంద, రామచంద్రారెడ్డి, ధనుంజయ, నారాయణరెడ్డి, అశోక్ కుమార్, మోపిడి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షాలతో
రూ.5 కోట్ల మేర నష్టం
కలెక్టర్‌కు విన్నవించిన వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి


