తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
తాడిపత్రి టౌన్/రూరల్: తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లకు మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పన్నాగం పన్నినట్లు తెలిసింది. శుక్రవారం తన నివాసం వద్ద నిర్వహించే మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావా లంటూ పిలుపునివ్వడం, అదే సమయంలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో టిప్పర్లతో రాళ్ల కుప్పలు తోలడంతో పట్టణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎప్పుడేం జరుగుతుందోనని పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతు న్నారు. ఎర్రవంక ఆక్రమణలతో పాటు తాడిపత్రి పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వారం క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ప్రకటనతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. జరిగిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో చేసేది లేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలకు తెరతీసినట్లు తెలి సింది. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన దాడి వీడియోలను జేసీ అనుచరులు వాట్సప్ గ్రూపులలో అప్‌లోడ్ చేస్తూ, మరో సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
పటిష్ట బందోబస్తు..
జేసీ పన్నాగం పసిగట్టిన పోలీసుశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా గురువారం పట్టణంలోని జేసీ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వారి మాటలను జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో విషయాన్ని వారు ఎస్పీ, తాడిపత్రి ఏఎస్పీల దృష్టికి తీసుకెళ్లి ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లరిమూకలు జేసీ నివాసానికి రాకుండా నియంత్రిస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ నివాసానికి చుట్టుపక్కల అన్ని రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్టీల నేతలకు నోటీసులు జారీ చేసి ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసే అవకాశమున్నట్లు తెలిసింది. శుక్రవారం అదనపు పోలీసు బలగాలు రానున్నట్లు తెలియవచ్చింది.
పెద్దారెడ్డిపై కేసు..
తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఐ ఆరోహణరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించారు. మంత్రి లోకేష్ బర్త్‌డే సందర్భంగా జేసీ ఇంటి వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే కళాశాల వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను రాళ్లు వదిలారని తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు రవితేజారెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
పన్నాగాలు ఆపని జేసీ
మరోసారి అల్లర్లకు కుట్ర
పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లకుప్పలు తోలిన వైనం
అప్రమత్తమైన పోలీసుశాఖ


