రహదారి నిబంధనలు పాటించాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్
అనంతపురం సెంట్రల్: ప్రతి ఒక్కరూ బాధ్యతగా రహదారి నిబంధనలు పాటించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. గురువారం రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టవర్‌క్లాక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 37 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్స్) గుర్తించి, అవసరమైన మరమ్మతులు, ఆడిటింగ్ పూర్తి చేశారన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీటీసీ వీర్రాజు మాట్లాడుతూ జిల్లాలో ఏటా సగటున 360 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, అందులో ఎక్కువ శాతం 25 సంవత్సరాలలోపు వారేనని తెలిపారు. ఇక నుంచి హెల్మెట్ లేకపోతే రూ. 1,000, లైసెన్స్ లేకపోతే రూ. 5 వేలు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మనిదీప్, ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్టీఓ సురేష్‌నాయుడు, డీఎస్పీ మహబూబ్‌బాషా, పోలీసు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.


