సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు | - | Sakshi
Sakshi News home page

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు

Jan 23 2026 6:48 AM | Updated on Jan 23 2026 6:48 AM

సుమోల

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు

యల్లనూరు: టాటా సుమోల పేరిట మోసం చేసిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాడిపత్రి కోర్టు జడ్జి అనిల్‌కుమార్‌ నాయక్‌ తీర్పు వెలువరించారు. పుట్లూరు సీఐ సత్యబాబు, ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపిన మేరకు... 2015లో యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సోమిరెడ్డి, అతని అల్లుడు శివ గౌతం రెడ్డిలు గొడ్డుమర్రి గ్రామానికి చెందిన నాగరాజు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని 40 శాతం తగ్గింపు అంటూ టాటా సుమోలు కట్టబెట్టారు. ఇది జరిగిన కొంత కాలానికే ఫైనాన్స్‌ వాళ్లు వచ్చి సుమోలను తీసుకొని వెళ్లారు. మోసపోయా నని గ్రహించిన నాగరాజు తన నుంచి తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని సోమిరెడ్డి, శివగౌతం రెడ్డిని నిలదీస్తే అందుకు వారు నిరాకరించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు యల్లనూరు పోలీస్‌స్టేషన్‌లో 2015 ఆగస్టు 25న కేసు నమోదైంది. తాడిపత్రి కోర్టులో పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నిందితులు, సాక్షులను విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. శివగౌతంరెడ్డి, సోమిరెడ్డిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనిల్‌కుమార్‌ నాయక్‌ తీర్పు చెప్పారు. నిందితులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించారు.

రేపటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. నాలుగో శనివారం, ఆదివారం సెలవు, ఇక రిపబ్లిక్‌డే సందర్భంగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. సమ్మె కారణంగా మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు.ఇప్పటికై తే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. వరుసగా నాలుగు రోజులు అంటే లావాదేవీలు బాగా స్తంభించే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.

భల్లూకం.. భయంభయం

కూడేరు: మండల పరిధిలోని మరుట్ల–2వ కాలనీలో భల్లూకం సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం వేకువ జామున రైతులు తమ పొలాల నుంచి వస్తుండగా ఎలుగుబంటి దాడి చేసేందుకు యత్నించింది. రైతులు పరుగులు తీసి ఎలాగోలా తప్పించుకున్నారు. రెండు రోజుల క్రితం ఎలుగుబంటి ఓ రైతు పొలంలో పైపులైన్‌ను ధ్వంసం చేసినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకం బారి నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

‘అధ్వాన భోజనం’పై విచారణ

రాప్తాడురూరల్‌: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయానగర్‌లోని వినయ్‌కుమార్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు విచారణకు ఆదేశించారు. భోజనం నాణ్యత, రుచిగా లేకపోవడంతో పలువురు విద్యార్థులు రోజూ ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుని భోజనం చేస్తుండడం, పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సులో ‘భోజనం రుచిగా ఉండడం లేదు ఫాదర్‌’ అంటూ విద్యార్థులు రాసిన లేఖలు ఎంఈఓ దృష్టికి వెళ్లిన వైనంపై గురువారం ‘సాక్షి’లో ‘మధ్యాహ్న భోజనం అధ్వానం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై డీఈఓ స్పందించారు. అనంతపురం డీవైఈఓ శ్రీనివాసరావు, రాప్తాడు ఎంఈఓ మల్లికార్జునను విచారణకు ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు. భోజనం నాణ్యత తగ్గినా, రుచి లేకపోయినా, శుభ్రంగా ఉండకపోయినా ఉపేక్షించేదే లేదన్నారు. నిరుపేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పూర్తిస్థాయి పాదర్శకంగా అమలు కావాల్సిందేనన్నారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని డీఈఓ స్పష్టం చేశారు.

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు 1
1/2

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు 2
2/2

సుమోల పేరిట మోసం... ఇద్దరికి ఆరు నెలల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement