అన్నింటా పైసా వసూల్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నింటా పైసా వసూల్‌

Jan 23 2026 6:48 AM | Updated on Jan 23 2026 6:48 AM

అన్నింటా పైసా వసూల్‌

అన్నింటా పైసా వసూల్‌

వన్‌టౌన్‌లో ‘వసూల్‌ రజా’

ప్రొటోకాల్‌ విధుల మాటున

భారీగా వసూళ్లు

స్టేషన్‌ బాస్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

అనంతపురం సెంట్రల్‌: నగరంలో వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పూర్తిగా గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్టేషన్‌లో పనిచేసే ‘వసూల్‌ రజా’ ‘సింగిల్‌ స్టార్‌’లా వెలిగిపోతున్నట్లు తెలిసింది. సీఐ ప్రొటోకాల్‌ డ్యూటీ మాటున ప్రతి నెలా వైన్‌షాపులు, బార్లు, మట్కా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని సమాచారం.

మద్యం షాపుల నిర్వాహకుల ఇష్టారాజ్యం..

పెత్తనం మొత్తం స్టేషన్‌ బాస్‌ ఆయనకే కట్టబెట్టారనే విమర్శలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు ఒకెత్తయితే వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ మరో ఎత్తు. ఎక్కువ పరిధితో పాటు నగరంలో సింహభాగం వాణిజ్య కార్యకలాపాలు స్టేషన్‌ పరిధిలోనే జరుగుతాయి. బార్లు, మద్యం దుకాణాలు, ధాబాలు కూడా వన్‌టౌన్‌ పరిధిలో అధికంగా ఉన్నాయి. వీటి నిర్వాహకులు నెలనెలా ‘వసూల్‌ రజా’కు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. ఏ ధాబాలోనైనా మద్యం ఫుల్లుగా తాగొచ్చు. సమయపాలన అంటూ లేకుండా లిక్కర్‌ విక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన నేరాల్లో ఎక్కువ శాతం నిందితులు మద్యం మత్తులో అకృత్యాలకు పాల్పడడం, మద్యం షాపులు, బార్ల వద్దే నేరాలు జరుగుతుండడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జీలు అడ్డాగా మారుతున్నా పట్టించుకునేవారు లేరు. గంజాయి, పేకాట, మట్కా మూడు పువ్వులు.. ఆరు కాయలు చందాన విరాజిల్లుతున్నాయి. స్టేషన్‌ పరిధిలో 70 మంది వరకూ మట్కా బీటర్లు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అందులో క్రియాశీలకంగా 20 మంది ఉన్నట్లు తెలిసింది. వారిపై ఇటీవల కాలంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

నలిగిపోతున్న సిబ్బంది

సీఐ ప్రొటోకాల్‌ డ్యూటీ కోసం సదరు ‘సింగిల్‌ స్టార్‌’ ఏకంగా ఓ మంత్రి నుంచి రెకమండేషన్‌ తెచ్చుకున్నారంటేనే ఏ స్థాయిలో ‘ఆశించి’ వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ ‘వసూల్‌ రజా’ కారణంగా స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. దీనికితోడు స్టేషన్‌ బాస్‌ బండబూతులు తిడుతుండడంతో తమ బాధ ఎవరికి చెప్పు కోవాలో తెలియక సిబ్బంది నలిగిపోతున్నారు. ఈ క్రమంలో ఎవరిని కదిలించినా స్టేషన్‌లో పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదంటున్నారు. స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన స్పెషల్‌ బ్రాంచ్‌ వారు పట్టించుకోకపోవడంతోనే ‘వసూల్‌ రజా’ ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement