సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
● పశు శాఖలో రూ.కోటి లూటీ వ్యవహారం
అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో వెలుగుచూసిన కుంభకోణంలో బాధ్యులపై చర్యలు మొదలయ్యాయి. ప్రాథమిక విచారణ తర్వాత ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ బి.సుశీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల కాపీని ఆ శాఖ మేనేజర్ ద్వారా సీనియర్ అసిస్టెంట్‌కు అందజేసినట్లు సమాచారం. రూ.కోటికి పైగా అక్రమార్కులు కొల్లగొట్టినట్లు ‘పశుశాఖలో గోల్‌మాల్’ శీర్షికన గత నెల 12న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అనంతరం ఈ వ్యవహారంలో ఎంత మొత్తం చేతులు మారిందనే విషయంపై వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో నెల రోజులుగా ఆ శాఖ జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం, డైరెక్టరేట్ అధికారులు అంతర్గతంగా ప్రాథమిక విచారణ కొనసాగించారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించిన ఉద్యోగులు, అందుకు అనుమతించిన పనిచేస్తున్న, రిటైర్ అయిన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పశుసంవర్ధక శాఖకు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల నుంచి బయటి వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు దాదాపు రుజువైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎంత అనేది పూర్తిస్థాయి విచారణలో వెల్లడవుతుందని చెబుతున్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్ర, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.03 కోట్లు వరకు నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. ఇందులో ఇరువురు కీలకపాత్ర వహించారని గుర్తించినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ బ్యాంకుల్లో ఉన్న పాత అకౌంట్లను జల్లెడ పట్టడం, మరికొన్ని బ్యాంకు ఖాతాల నుంచి నిధులు లేని పాత అకౌంట్లలోకి సొమ్ము మళ్లించి, అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులు, బయటి వ్యక్తుల ఖాతాల్లోకి పంపించినట్లు తేల్చారు. దీనిపై నెల రోజులుగా బాధ్యుల నుంచి వివరాలు సేకరించారు. అయితే సరైన సమాచారం, ఓచర్లు, బిల్లులు, ఇతరత్ర వివరాలు అందించకపోవడంతో చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రస్థాయి విచారణ బృందం రానుందని సమాచారం. సీనియర్ అసిస్టెంట్‌తో పాటు విశ్రాంత జేడీ, అలాగే మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.


