● టీడీపీ నాయకుడు సైఫుద్దీన్ ఆవేదన
అనంతపురం టౌన్: టీడీపీలో మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి సైపుద్దీన్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. అందులో ఏ ఒక్కదానిలోనూ మైనార్టీలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేసిందన్నారు. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఇస్తామని పేర్కొంటున్న చంద్రబాబు ఎంత మందికి స్థానం కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పార్టీలో న్యాయం జరుగుతోందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 13న అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట తల పెట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


