సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా?
అనంతపురం: సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా చంద్రబాబూ.. అంటూ సీఎంను వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆరు నెలల్లోనే రాష్ట్రాభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు రూ.63 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఈ పదహారు నెలల పాలనలో ఏకంగా రూ.2.27 లక్షల కోట్లు అప్పులు చేసినట్లుగా కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఈ డబ్బు ఏమైందని సగటు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇందులోనూ రూ.1.57 లక్షల కోట్లు నగదు బదిలీ ద్వారా ప్రజలకు నేరుగా చెల్లించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించిన మొత్తానికి జవాబుదారీతనం ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ప్రభుత్వ, ప్రజల ఆస్తులు తగ్గిపోతున్నాయన్నారు. గతంలోనూ.. ఇప్పుడూ అదే పరిస్థితి అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అమ్మేయడం, ప్రజల్లోనూ కొనుగోలు శక్తి తగ్గిపోయేలా చేసి, ఆస్తులను అమ్ముకునే స్థాయికి దిగజార్చడం చంద్రబాబు పాలనలో పరిపాటిగా మారిందన్నారు. ‘శాశ్వతంగా అధికారంలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారని, అందువల్లే వారం రోజుల్లోనే వీవీ ప్యాట్లు కాల్చివేశారనే అనుమానం ప్రజల్లో ఉంది. సీఎం పదవే అనుమానాస్పదంగా ఉందని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరహాలో ప్రజలను మోసగించవచ్చునని భావిస్తున్నారేమో.. ఎల్లకాలం కుట్రలు ఫలించవనే విషయాన్ని గుర్తుంచుకోవాల’ని శైలజనాథ్ అన్నారు. విమర్శించే రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారని, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూడడం చంద్రబాబు నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో సంబంధం లేకపోయినా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్ ఎక్కడున్నారో.. తాట తీస్తాను అనే డైలాగ్ ఏమైందో.. అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయన్నారు. మద్యం నకిలీదా? మంచిదా? అని పరిశీలించడానికి బెల్టుషాపుల్లో ఎవరు క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేట్‌కరణను నిరసిస్తూ ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం


