ఈ నరకం భరించలేకున్నా..
గుంతకల్లు: కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు దూరం చేసేందుకు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. తనను ఈ నరకం నుంచి బయట పడేయాలంటూ ఓ సెల్ఫీవీడియో ద్వారా అభ్యర్థిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్, షకీలాభాను దంపతులకు నలుగురు కుమార్తెలు. అనారోగ్యంతో దంపతులు మృతి చెందారు. స్థానిక దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న నూర్ మహమ్మద్ మూడో కుమార్తె షబానాబేగం చెల్లెలు జుబేదా బేగాన్ని ఆదరించి, ఆటో డ్రైవర్ అలీ బాషాకు ఇచ్చి పెళ్లి జరిపించింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం కావడంతో జుబేదా బేగం దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని, కడపకు చెందిన ఏజెంట్ మహమ్మద్ రఫీని సంప్రదించింది. అతని ద్వారా కువైట్‌లో ఇంటి పనిచేయడానికి 8 నెలల క్రితం వెళ్లింది. అయితే అక్కడ యజమాని 8 నెలలుగా వేతనం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో దిక్కుతోచలేదు. కనీసం భోజనం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తుండడంతో భరించలేని జుబేదా బేగం సెల్ఫీ వీడియోలో తన వేదనను వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు పంపింది. తనను ఎలాగైనా గుంతకల్లుకు రప్పించాలని వేడుకుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతమైంది. ఈ విషయంగా కుటుంబసభ్యులు నేరుగా వెళ్లి ఏజెంట్‌ను సంప్రదిస్తే... వెనక్కు రప్పించేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేని స్థితిలో తాము ఉన్నామని, ఎలాగైనా జుబేదాబేగంను గుంతకల్లుకు రప్పించాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
ఎలాగైనా గుంతకల్లుకు రప్పించండి
ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన
మహిళ వేదన
సెల్ఫీవీడియో తీసి కుటుంబసభ్యులకు పంపినా జుబేదా


