
మహనీయుల జీవితం ఆదర్శప్రాయం
అనంతపురం అర్బన్: మహనీయుల జీవితాలు ఆదర్శప్రాయమని, వారు చూపిన శాంతి మార్గంలో నడవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 2న కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనమంతా స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేంగా మహాత్మాగాంధీ అహింసను ఆయుధంగా చేసుకుని ఉద్యమించారన్నారు. గాంధీ మహాత్ముడు అందించిన స్పూర్తితో ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్ధేందుకు పౌరులు కృషి చేయాలని పిలపునిచ్చారు. లాల్‌బహదూర్ శాస్త్రి స్వాతంత్య్రోద్యమంలో సైనికులు, రైతులు పాత్రను గుర్తు చేస్తూ జై జవాన్– జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, పరిపాలనాధికారి అలెగ్జాండర్, తహసీల్దార్లు హరికుమార్, రియాజుద్ధీన్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆగమేఘాల మీద ‘సెక్టోరియల్స్’ చేరిక
● ఆసక్తి చూపని ఏఎస్‌ఓ..
ఆ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్?
అనంతపురం ఎడ్యుకేషన్: ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న సమగ్రశిక్షలోని సెక్టోరియల్ అధికారుల పోస్టులను ఎట్టకేలకు భర్తీ చేశారు. జిల్లా అధికారులు పంపిన జాబితాకు రాష్ట్ర అధికారులు ఆమోదముద్ర వేశారు. అక్కడి నుంచి జాబితా రాగానే ఎంపికై న టీచర్లు స్కూళ్లల్లో రిలీవ్ అయి ఆగమేఘాల మీద సమగ్రశిక్ష కార్యాలయంలో చేరారు. అసిస్టెంట్ సీఎంఓ కె.చంద్రశేఖర్, ఏఎంఓ పి.వేణుగోపాల్, అలెస్కో కె.రామచంద్ర, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) బి.నారాయణస్వామి విధుల్లో చేరగా.. ఏఎస్‌ఓగా ఎంపికై న ఎన్.నరసింహారెడ్డి మాత్రం చేరలేదు. వాస్తవానికి ఈయన అందరికంటే మెరిట్ ఉన్నట్లు తెలిసింది. ఏఎంఓ పోస్టు పట్ల ఆసక్తి ఉన్నా.. ఆయనను ఏఎస్‌ఓ పోస్టుకు ఎంపిక చేయడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆసక్తి చూపలేదు. దీంతో ఏఎస్‌ఓ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్ పడినట్లేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై
కోర్టుకు..
అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై తపోవనం జిల్లా పరిషత్ పాఠశాల ఇంగ్లిష్ టీచరు కిష్టప్ప హైకోర్టును ఆశ్రయించారు. ముందు నోటిఫికేషన్‌లో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధికారులు ఎంపిక చేశారు. ఆమోదం కోసం రాష్ట్ర అధికారులకు నివేదించగా.. ఎలాంటి కారణం లేకుండా ఆయన్ను తప్పించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న తనను నిబంధనలకు విరుద్ధంగా తప్పించారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్‌లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ కన్నడలో చదివి ఉండాలని పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న నారాయణస్వామి ప్రాథమిక స్థాయిలో అది కూడా ఒక తరగతి మాత్రమే కన్నడలో చదివినట్లు తెలిసింది. ఈయనను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.