
పండుగ పూట విషాదం
రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడి దుర్మరణం
తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమార్తెలు
ఉరవకొండ/ వజ్రకరూరు: ఆ దంపతులు వారసుడి కోసం ఎన్నో నోములు నోచారు. ఎన్నో గుళ్లు తిరిగారు. ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పుట్టడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. అలా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం ఒక కుదుపు కుదిపేసింది. దసరా పండుగకు ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి సంబరంగా ఉన్నారు. తండ్రీ పిల్లలు అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. ‘అమ్మా గుడి నుంచి రాగానే నాకు ఓళిగ చేసి పెట్టాలి’ అంటూ కొడుకు చెప్పాడు. అవే కొడుకు చివరి మాటలు అవుతాయని ఆ తల్లి ఊహించలేదు. అరగంటకే రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడు దుర్మరణం చెందారన్న వార్త ఆమెను కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మీనుగ సుంకన్న (43), నాగలక్ష్మి దంపతులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ముగ్గురు కుమార్తెలు సులోచన, కల్పన, భవానితో పాటు కుమారుడు సుదర్శన్ (10) సంతానం. గురువారం ఉదయం దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం వజ్రకరూరు మండలం కడమలకుంటకు ద్విచక్రవాహనంపై ఉరవకొండ నుంచి తన కుమారుడు సుదర్శన్, కుమార్తెలు కల్పన, భవానితో కలిసి సుంకన్న బయల్దేరాడు. భార్య నాగలక్ష్మి, పెద్ద కుమార్తె సులోచన ఇంటివద్దే ఉన్నారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని మార్గ మధ్యంలో పీసీ ప్యాపిలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న, కుమారుడు సుదర్శన్ అక్కడికక్కడే మరణించారు.
ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళుతున్న వాహనదారులు గమనించి వెంటనే వజ్రకరూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ సుంకన్న భార్య గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. గాయపడిన కుమార్తెలను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. సుంకన్న భార్య ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం