
బెళుగుప్ప ఎంపీపీపై ‘అవిశ్వాసం’ పెట్టండి
● ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు
కళ్యాణదుర్గం: బెళుగుప్ప ఎంపీపీ సి.పెద్దన్నపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది పార్టీ నాయకులతో కలిసి కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచి ఎంపీపీగా పదవి అలంకరించిన పెద్దన్న అనంతర కాలంలో టీడీపీలోకి చేరిపోవడంతో పాటు అభివృద్ధి పనులకు సహకరించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారని వాపోయారు. ఇలా పలు కారణాలతో మెజార్టీ సభ్యులైన తాము ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1991లోని 245 సెక్షన్ 1 మేరకు సి.పెద్దన్నపై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తమ విన్నపం మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల కన్వీనర్ మచ్చన్న, జెడ్పీటీసీ త్రిలోక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగప్ప, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, రమణేపల్లి సర్పంచ్ రమేష్, కాలువపల్లి మాజీ సర్పంచ్ తిమ్మన్న, గుండ్లపల్లి వెంకటరెడ్డి, మోహన్, ఎంపీటీసీలు సురేష్‌బాబు, ప్రసాద్, ఈర బొమ్మన్న, పుష్పావతి, వరలక్ష్మి, అంజినమ్మ, నాగరత్నమ్మ, ప్రభావతి, రేఖమ్మ తదితరులు పాల్గొన్నారు.