
1,009 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
అనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి 1,009.495 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌లో వ్యాగన్ల ద్వారా వచ్చిన యూరియా నిల్వలను వారు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చినదాంట్లో మార్క్‌ఫెడ్‌కు 520 మెట్రిక్ టన్నులు, మిగతా 489.495 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు, మన గ్రోమోర్‌సెంటర్లకు కేటాయించినట్లు వెల్లడించారు. ఇండెంట్ల మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలకు, అలాగే మనగ్రోమోర్, ప్రైవేట్ డీలర్ల నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తారని తెలిపారు.
సెల్‌ఫోన్ రిపేరీపై
రేపటి నుంచి శిక్షణ
అనంతపురం సెంట్రల్: సెల్‌ఫోన్ రిపేర్ కోర్సుపై నిరుద్యోగులకు ఈ నెల 6 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. 45 రోజులు శిక్షణాకాలంలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం, శిక్షణ అనంతరం టూల్‌కిట్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎకాలజీ సెంటర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఆకతాయికి చెప్పుదెబ్బ
● ధైర్యంగా ఫిర్యాదు చేసిన యువతి
అనంతపురం: మద్యం మత్తులో అమ్మాయిలను ఇబ్బందిపెడుతున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో హౌసింగ్‌బోర్డులోని ఎస్‌ఆర్ వైన్స్ దగ్గర రోడ్డుపై ముగ్గురు యువకులు పీకలదాకా తాగి హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఓ యువకుడు తాకాడు. దీంతో ఆ అమ్మాయి ధైర్యంగా తిరగబడింది. చెప్పు తీసుకుని చితక్కొటింది. అనంతరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈవ్‌టీజర్లు అనంతసాగర్ కాలనీకి చెందిన రవికుమార్, వేణుగోపాల్, శివశంకర్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని సీఐ శ్రీకాంత్‌యాదవ్ శనివారం తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను వేధిస్తే ఎవ్వరికై నా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు.
రైలుకిందపడి వ్యక్తి ఆత్మహత్య
పామిడి: పి.కొండాపురం రైల్వేగేట్ సమీపాన పెద్దమ్మ గుడి వెనుక శనివారం గుర్తు తెలియని వ్యక్తి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల ఛిద్రమైపోయింది. తెల్ల అంగీ, పంచె, ఎర్ర టవల్ ధరించి ఉన్నాడు. గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.