బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు? | - | Sakshi
Sakshi News home page

బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు?

Oct 5 2025 2:28 AM | Updated on Oct 5 2025 2:28 AM

బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు?

బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు?

రాప్తాడు: ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి.. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తట్టుకోలేకపోయిన యువకుడు ‘బుజ్జీ.. నువ్వు లేని జీవితం నాకెందుకు.. నేను చనిపోతున్నా’ అంటూ పురుగుమందు డబ్బా చేతపట్టుకుని సెల్ఫీ తీసుకుని సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామానికి చెందిన కత్తె లింగమయ్య, మాలమ్మ దంపతుల కుమారుడు కత్తె పోతులయ్య, నార్పల మండలంలోని అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల వారికి చెప్పకుండా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం తమకు ఇష్టం లేదని, మైనార్టీ కూడా తీరలేదని అమ్మాయి తల్లిదండ్రులు నార్పల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రేమికులను పట్టుకొచ్చి.. పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరినీ ఎవరిళ్లకు వారిని పంపించేశారు. మైనార్టీ తీరే వరకు దూరంగా ఉండాలని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో బాలికకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో పోతులయ్య తట్టుకోలేకపోయాడు. ‘నువ్వు లేని జీవితం నాకెందుకు.. బుజ్జీ (ప్రేమించిన అమ్మాయి) నేను చనిపోయిన తర్వాతైనా మన కుటుంబాలను కలుపుతావని అనుకుంటున్నా. నేను చనిపోవాలనుకునే వారందరికీ ధన్యవాదాలు. ఒక వేళ మమ్మల్ని కలిపే ఉద్దేశం ఉంటే బతికించాలని, లేనిపక్షంలో నన్ను వదిలేయండి. మామా నీకు ఎంతో ఇష్టమైన స్థలంలోనే చచ్చిపోతున్నా. కడుపులో చాలా నొప్పిగా ఉంది మామా. నీ కోసం అగ్గి పెట్టె ఒకటే తెచ్చాను. బీడీలు తేలేకపోయాను మామా. బుజ్జీ నేను చచ్చిపోతున్నా.. నువ్వన్నా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఊళ్లో చనిపోతే నువ్వు రావని, మీ ఊర్లో వచ్చి చచ్చిపోతున్నాను బుజ్జీ. దయచేసి నా శవాన్ని మీ ఊర్లోనే పూడ్చి పెట్టాలి. బుజ్జి నా శవం నీ ఒక్కదానికే దొరకాలని కోరుకుంటున్నా. ఈ ప్లేస్‌ మీరు చూపించిన ప్లేసే. మామ వాళ్లు, వీళ్లు చెప్పిన మాటాలు విని పంతానికి పోయావు. ఇదొక్కసారి నా మాట వింటావని కోరుకుంటున్నా. మీ గ్రామంలోనే పురుగులమందు తాగుతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో తీసి, వారి కుటుంబ సభ్యులకు పంపించిన తర్వాత పోతులయ్య తన సెల్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు.

పురుగుమందుబాటిల్‌తో యువకుడి ఆత్మహత్యాయత్నం

సెల్పీ వీడియో అనంతరం సెల్‌ స్విచాఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement