
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
● బీసీ నేతల పిలుపు
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. జనగణనలోనే కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాలులో కుల, ప్రజాసంఘాలతో సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, కురబ సంఘం తరఫున మాజీ మయర్ రాగే పరశురాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదా గాంధీ, తదితరులు మాట్లాడారు. కులగణన ద్వారానే బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వమని జపం చేస్తూనే.. మరోవైపు కులగణన చేపట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. కులగణన డిమాండ్‌తో ‘చలో అమరావతి’ చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సదస్సులో సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, వడ్డెర సంఘం నాయకుడు వడ్డే జయంత్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎస్‌ఆర్ నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు, మైనారిటీ నాయకులు మైనుద్ధీన్, నాయకులు సంజీవప్ప, శ్రీరాములు, కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్, సంతోష్ కుమార్, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు.