
అక్రమ రవాణాకు రథసారథులు
అనంతపురం క్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి నిషేధిత వస్తువులు, మద్యం రవాణా అవుతోంది. కొన్ని ముఠాలు ఎరగా వేసే డబ్బుకు లొంగిపోయి కొందరు డ్రైవర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బెంగళూరు నుంచి ఆర్మీ లిక్కర్ బాటిళ్లను అనంతపురానికి తీసుకొస్తున్న ఆర్టీసీ డ్రైవరును ఎకై ్సజ్ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు బస్సుల్లో తనిఖీలు పూర్తిగా వదిలేయడం వల్లే అక్రమ రవాణా ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గత సెప్టెంబరు 20న బెంగళూరు రూటుకు వెళ్లే డ్రైవర్ల వ్యవహారంపై ‘గాడి తప్పిన ఆర్టీసీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ రూటుకు వెళ్లాల్సిన డ్రైవర్లు కాకుండా అధికారులను ‘బాగా చూసుకునే’ వారిని విధులకు పంపుతున్నారని కథనంలో పేర్కొంది. చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు ఎకై ్సజ్ అధికారుల దాడుల అనంతరం గానీ తెలియరాలేదు.
తప్పు చేసినా.. చర్యలు శూన్యం
ఆర్టీసీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆర్‌ఎం సుమంత్ ఆదోని ఈ వ్యవహారాల్లో తలదూర్చలేదు. ప్రస్తుతమున్న ఆర్‌ఎం శ్రీలక్ష్మి కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కిందిస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. తప్పు చేసిన వారు ఆధారాలతో సహా దొరికినా.. చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులే వారిని రక్షిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకే కిందిస్థాయి సిబ్బంది ఏమాత్రం భయపడకుండా.. అక్రమాలకు పాల్పడుతున్నారు.
నిషేధిత వస్తువులు వస్తున్నాయిలా..
అనంతపురం జిల్లా కేంద్రానికి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి నిషేధిత వస్తువులను ఎక్కువగా డ్రైవర్లే తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఏపీఎస్ ఆర్టీసీతో పాటు కర్ణాటక బస్సుల డ్రైవర్లు కూడా ఈ తరహా రవాణాకు తెగబడుతున్నట్లు పక్కా సమాచారం ఉంది. కాగా నేరుగా కర్ణాటక బస్సుల డ్రైవర్లతో కొన్ని ముఠాలు పార్సిళ్లు తెప్పించుకుంటున్నట్లు నిఘా సంస్థల అధికారులు గుర్తించారు. ఇకపై సాధారణ వాహనాల తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి పంపాలన్న యోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది.
అధికారుల సేవలో స్క్వాడ్ టీమ్..
ఫలానా అధికారి మనకు వస్తే అనుకూలంగా ఉంటారు.. మనం విధులకు డుమ్మాకొట్టి ఇక్కడే కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండొచ్చనే వారి సంఖ్య ఈ స్క్వాడ్ టీమ్‌లో అధికంగా ఉందన్న ఆరోపణలున్నాయి. గత ఆర్‌ఎం సమయంలో స్క్వాడ్ టీమ్‌లోని కీలక వ్యక్తులు కార్యాలయం వీడి బయటకు వెళ్లలేదని సహచర ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఉదయం ఆర్‌ఎం ఇంటికి కాయగూరలు మొదలు, అధికారి ఆలయ దర్శనం వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవడమే స్క్వాడ్ టీమ్ విధులని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ రవాణాకు సహకరిస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మద్యం, నిషేధిత వస్తువుల రవాణా
ముఠాలు వేసే ఎరకు చిక్కుకుంటున్న ఆర్టీసీ డ్రైవర్లు
బస్సుల తనిఖీలను విస్మరించిన ఉన్నతాధికారులు
తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న వైనం

అక్రమ రవాణాకు రథసారథులు