
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యప్రభ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు.
కేశేపల్లి టీచర్‌కు
అంతర్జాతీయ కార్టూనిస్ట్ అవార్డు
శింగనమల(నార్పల): అబ్లా ఆర్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కార్టున్ – ఎల్‌నాస్‌ఎల్ హల్వా 2025 పోటీల్లో నార్పల మండలంలోని కేశేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఆర్ట్ టీచర్ చిన్న కుళ్లాయప్పకు అవార్డు దక్కింది. క్యారికేరేచర్ విభాగంలో వివిధ దేశాలకు చెందిన పలువురు కార్టూనిస్ట్‌లు పోటీ పడగా, భారత దేశం నుంచి తలపడిన చిన్న కుళ్లాయప్ప ద్వితీయ స్థానంలో నిలిచారు. దీంతో ఆయనను నార్పల మండల వాసులు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
● ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్
డిమాండ్
అనంతపురం మెడికల్: పీహెచ్‌సీ వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని కూటమి సర్కార్‌కు ఏపీ పీహెచ్‌సీ వైద్యుల సంఘం నాయకులు హితవు పలికారు. సమ్మెలో భాగంగా శుక్రవారం అనంతపురంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీహెచ్‌సీ వైద్యులుగా మూడేళ్ల పాటు విధులు కొనసాగించిన తర్వాత పీజీ వైద్య విద్యను అభ్యసించడానికి గతంలో ఉన్న 30 శాతాన్ని 15 శాతానికి కుదించడం సబబు కాదన్నారు. టైం బౌండ్ పదోన్నతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గత నెలలో సెకండరీ హెల్త్ సర్వీసులో కేవలం రెండు సంవత్సరాలు పూర్తయిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా హోదా ఇచ్చి ఇంత వరకూ ప్రొబేషనరీ పీరియడ్ డిక్లరేషన్ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు డాక్టర్ లోకేష్, డాక్టర్ శివసాయి, డాక్టర్ మనోజ్, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శివశంకర్ నాయక్, డాక్టర్ జయకుమార్ నాయక్, డాక్టర్ స్వాతి, డాక్టర్ సుష్మిత డాక్టర్ చందన, డాక్టర్ హనీషా తదితరులు పాల్గొన్నారు.
‘దుర్గం’లో పట్టపగలే భారీ చోరీ
● రూ.10 లక్షల నగదు,
20 తులాల బంగారం అపహరణ
కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీ నగర్‌లో పట్టపగటే భారీ చోరీ జరిగింది. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉదయం బంధువుల ఇంటికెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలోపు చోరీ జరగడం గమనార్హం. పోలీసులు తెలిపిన మేరకు... పార్వతీనగర్‌లో నివాసముంటున్న మహేంద్ర నాయుడు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆటోమొబైల్స్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం బంధువుల ఆహ్వానం మేరకు బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో జరిగే ఓ విందు కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిలోపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి గమనించారు.రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ హరినాథ్, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీల్లో ఓ దొంగ కదలికలను పోలీసులు స్పష్టంగా గుర్తించారు.
బదిలీపై 22 మంది టీచర్ల రాక
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా జిల్లాకు 22 మంది వచ్చారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు సమక్షంలో కౌన్పెలింగ్ నిర్వహించి స్కూళ్లు కేటాయించారు. బదిలీల్లో జిల్లాకు వచ్చిన వారిలో హెచ్‌ఎంలు ఇద్దరు, పీఎస్‌హెచ్‌ఎంలు ఇద్దరు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకరు, గణితం ముగ్గురు, పీఎస్ ముగ్గురు, బీఎస్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, పీఈటీ ఒకరు, ఎస్జీటీలు ఏడుగురు ఉన్నారు. కాగా 3, 4 కేటగిరీలకు సంబంధించి కొన్ని స్కూళ్లు మాత్రమే ఖాళీలు చూపడంపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆయా కేటగిరీల్లో అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు