కళ్యాణదుర్గం: పట్టణంలోని అక్కమాంబ కొండకు ఆనుకుని ఉన్న పార్వతినగర్‌లోని జనావాసాల్లోకి బుధవారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. సమీపంలోని ఓ ఇంటి ఆవరణలోని మెట్లపై కుక్క పడుకుంది. ఒక్క ఉదుటున చిరుత దాడి చేసి కుక్కను కిందకు లాక్కొచ్చింది. గట్టిగా అరుస్తూ చిరుత నుంచి తప్పించుకున్న కుక్క మరో వైపున పరుగెత్తింది. అదే సమయంలో అక్కడే ఆరుబయట పడుకున్న ఓ వ్యక్తి లేవడంతో చిరుత అటునుంచి కొండప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచారంపై పలుమార్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జనావాసాల్లోకి రాకుండా చిరుతను బంధించి అటవీ ప్రాంతంలోకి వదలేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సత్యసాయి జయంతిఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా యశ్వంతపూర్–హిందూపురం (06518/19) ప్యాసింజరును ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే బెంగళూరు–ధర్మవరం మధ్య మరో ప్యాసింజర్ రైలు (06595/96) ఈ నెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు వెల్లడించారు.
సీఈసీ, ఎస్‌ఈసీలో
పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్‌ఈసీ)ల్లో జిల్లాకు చెందిన కొందరికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ సభ్యులుగా ఉమామహేశ్వర్ నాయుడు(కళ్యాణదుర్గం), రంగన్న, నదీం అహ్మద్ (అనంతపురం అర్బన్), ఎస్‌ఈసీ సభ్యులుగా బోగాతి నారాయణరెడ్డి (శింగనమల), గౌని ఉపేంద్రరెడ్డి (రాయదుర్గం), లింగాల శివశంకర్‌రెడ్డి (అనంతపురం అర్బన్), బొంబాయి రమేష్‌నాయుడు (తాడిపత్రి) నియమితులయ్యారు.
వామ్మో చిరుత...!