
● కంటి తుడుపు ప్రదర్శన.. కనిపించని రైతులు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ఆగ్రోస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులు కరువయ్యారు. ఏదో చేయాలంటే చేయాలన్నట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పట్టుమని 20 మంది కూడా రైతుల హాజరు కాలేదు. వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆగ్రోస్ మేనేజర్ ఓబుళపతి, డ్వామా పీడీ సలీంబాషా, జెడీబీఎన్‌ఎఫ్ డీపీఎం లక్ష్మానాయక్, ఏఆర్‌ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.విజయశంకరబాబు, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, ఏడీఏ అల్తాఫ్‌తో పాటు ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, ఓ ఎన్‌జీఓ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. డ్రోన్లు, రోటోవీటర్లు, టిల్లర్లు, ఇతర కొన్ని పరికరాలు ప్రదర్శించారు. ట్రాక్టర్లు, డ్రోన్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించినట్లు జేడీఏ తెలిపారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం: జూనియర్ న్యాయవాదులకు తక్షణమే స్టైఫండ్ చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు డిమాండ్ చేశారు. అనంతపురం బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమిత్ర పథకం కింద ప్రతి నెలా జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే శిక్షణ భృతిని పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని విమర్శించారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించకపోతే అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐలు అధ్యక్ష, కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈ.ప్రసాద్, నాగరాజు, కమిటీ సభ్యులు నాగభూషణ్, శ్రీనివాస్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

● కంటి తుడుపు ప్రదర్శన.. కనిపించని రైతులు