
గొంతు కోసుకుని.. ఆస్పత్రి నుంచి పరుగు తీసి!
ఉరవకొండ/అనంతపురం కార్పొరేషన్: క్షణికావేశంలో పొలాల్లో గొంతు కోసుకున్న ఓ యువకుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. అతికష్టంపై పోలీసులు వెంటాడి పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్‌లో చేర్పిస్తే అక్కడా తనదైన శైలిలో రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండలోని హమాలీ కాలనీకి చెందిన శేఖర్‌కు వివాహమైంది. పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శేఖర్ క్షణికావేశానికి లోనై గురువారం బూదగవి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు. అటుగా వెళుతున్న రైతుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా అందరినీ తోసేసి రోడ్డుపైకి పరుగు తీశాడు. సీఐ మహనందితో పాటు సిబ్బంది వెంటపడి పరుగు తీసినా చేతికి చిక్కకుండా తప్పించుకోని పారిపోతుండగా స్థానికులు అతి కష్టంపై అడ్డుకుని నిలువరించారు. వెంటనే శేఖర్‌ను పట్టుకుని పోలీసులు ఆస్పత్రికి చేర్చి, దగ్గరుండి చికిత్స చేయించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని జీజీహెచ్‌కి తరలించారు.
జీజీమెచ్‌లో హల్‌చల్..
గురువారం రాత్రి 8 గంటల సమయంలో శేఖర్‌ను జీజీహెచ్‌కు పోలీసులు, కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అయితే చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ క్యాజువాలిటీలోని టేబుళ్లపైకి ఎక్కి కేకలు వేస్తూ హల్‌చల్ చేశాడు. చివరకు ఈఎన్‌టీ వైద్యురాలు డాక్టర్ మధులిక, తదితరులు శేఖర్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, మెయిన్ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేసి, ఈఎన్‌టీ వార్డుకు తరలించారు. కాసేపటికి తేరుకున్న శేఖర్ అక్కడున్న సెక్యూరిటీ, అటెండర్‌పై కర్రతో దాడి చేశాడు. శుక్రవారం ఉదయం శేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం కడప ఆస్పత్రికి తరలించారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
జీజీహెచ్‌లో సర్జరీ తర్వాత
సెక్యూరిటీ, తదితరులపై దాడి