
పెట్రోల్ బంకుల్లో దోపిడీ
జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో వినియోగదారుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తాజాగా అనంతపురంతో పాటు గుంతకల్లులో పెట్రోల్ బంకుల్లో మోసాలపై స్థానికులు తిరగబడ్డారు.
అనంతపురం: నగరంలోని గుత్తిరోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో తక్కువ పెట్రోల్ పోస్తూ మోసం చేస్తున్నారంటూ యువకులు ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కాశీవిశ్వనాథ్ అనే యువకుడు రూ.100 ఇచ్చి పెట్రోల్ పట్టాలని కోరాడు. అందులో కేవలం 50 రూపాయల విలువ గల పెట్రోల్ మాత్రమే పట్టారు. బైక్ నుంచి పెట్రోల్‌ను బాటిల్‌కు తీసుకుని పరిశీలిస్తే కొలతల్లో తేడా రావడంతో పెట్రోల్ బంకు పంప్ ఆపరేటర్‌ను నిలదీశాడు. మీరు ఇచ్చింది రూ.50. పెట్రోల్ కూడా అంతే వేశానంటూ బుకాయించాడు. దీంతో వినియోగదారుడిలో అసహనం రేకెత్తింది. ఈ పెట్రోల్ బంకులో ఏళ్ల తరబడి మోసం జరుగుతోందని, ఈ రోజు పరిశీలిస్తే గుట్టు రట్టయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. బాధిత వినియోగదారుడికి మద్దతుగా పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలిపారు. ప్రజల్ని మోసగిస్తూ.. తక్కువ పెట్రోల్‌ను పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు చెట్ల కుండీలను పగులగొట్టారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. శనివారం వరకూ పెట్రోల్ బంకు తెరవకూడదని, తూనికలు కొలతల శాఖ అధికారులతో తనిఖీ చేయించిన అనంతరం వారు ఆమోదిస్తేనే పెట్రోల్ బంకు తెరవాలని సీఐ ఆదేశించారు.
కొలతల్లో భారీ వ్యత్యాసాలు
నిలదీసిన వినియోగదారులపై దౌర్జన్యం
వాహనదారుల్లో పెల్లుబుకిన ఆగ్రహం